తెలంగాణ

telangana

ETV Bharat / city

భగవంతుని ఆశీస్సుల కోసమే ఆలయ మర్యాదలు కోరాం: శారదాపీఠం

విశాఖ స్వరూపానందేంద్ర జన్మదినం సందర్భంగా ఆలయ మర్యాదలు కోరుతూ రాసిన లేఖను... ఉపసంహరించుకున్నట్లు ఏపీ హైకోర్టుకు శారదా పీఠం తెలిపింది. శారదా పీఠం లేఖపై దేవదాయ శాఖ జారీచేసిన మెమోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై... ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఆలయ మర్యాదలు కావాలన్న అభ్యర్థనను ఉపసంహరించుకోవడం వల్ల... పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

withdrawal-of-a-letter-to-the-sharda-dean-seeking-temple-etiquette
భగవంతుని ఆశీస్సుల కోసమే ఆలయ మర్యాదలు కోరాం: శారదాపీఠం

By

Published : Nov 17, 2020, 4:21 PM IST

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలను జరపాలంటూ పలు దేవాలయాలకు ఏపీ దేవాదాయశాఖ మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 18న ఆయన జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో శారదాపీఠం స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘స్వరూపానందేంద్ర జన్మదినం సందర్భంగా భగవంతుని ఆశీస్సులు కోసమే ఆలయ మర్యాదలు కోరాం. 2004 నుంచి ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాం. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆలయ మర్యాదలు కొనసాగించాలని కోరుతూ లేఖ రాశాం. దీనిపై అసత్య ప్రచారాలు, రాద్ధాంతాలు చేయడం సరికాదు.

ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తప్పకుండా స్వీకరిస్తాం’’ అని శారదాపీఠం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు దేవాదాయ శాఖ జారీ చేసిన మెమోను సవాల్‌ చేస్తూ లలిత్‌ కుమార్‌ అనే వ్యక్తి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఆలయ మర్యాదలు కోరుతూ రాసిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు శారదాపీఠం హైకోర్టుకు తెలియజేయడంతో ఈ పిటిషన్‌పై విచారణ ముగిసినట్లు అయింది.

ఇదీ చదవండి:'దేశంలో ఎక్కడాలేని విధంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్'

ABOUT THE AUTHOR

...view details