తెలంగాణ

telangana

గురుకులాల్లో భారీగా పోస్టులు.. 10 వేల వరకు భర్తీ అయ్యే అవకాశం..

By

Published : Feb 22, 2022, 6:08 AM IST

గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 10 వేల పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. కొత్తగా గుర్తించిన పోస్టులతో పాటు గతంలో మంజూరైన వాటి భర్తీకి నూతన జోనల్‌ విధానం మేరకు అనుమతుల కోసం ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపించాయి. ఇవి భర్తీ అయితే.. పోలీస్‌శాఖ తరువాత అత్యధిక పోస్టులు గురుకులాల్లోనే ఉంటాయని సమాచారం.

Up to 10 thousand posts to be filled in gurukula schools in telangana
Up to 10 thousand posts to be filled in gurukula schools in telangana

సంక్షేమ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 10 వేల పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. నూతన జోనల్‌ విధానం అమలుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. అయినా.. కొత్తగా గుర్తించిన పోస్టులతో పాటు గతంలో మంజూరైన వాటి భర్తీకి నూతన జోనల్‌ విధానం మేరకు అనుమతుల కోసం ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపించాయి. ఇవి భర్తీ అయితే.. పోలీస్‌శాఖ తరువాత అత్యధిక పోస్టులు గురుకులాల్లోనే ఉంటాయని సమాచారం.

రాష్ట్రంలో 970 గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో మైనార్టీ, బీసీ సొసైటీల పరిధిలో 485 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో వివిధ కేటగిరీల్లో 5,387 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో 1,250కు పైగా లెక్చరర్‌ పోస్టులు రానున్నాయి. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సొసైటీల్లో గతంలో భర్తీ చేయకుండా మిగిలిపోయిన భాషా పండితులు, పీఈటీలు ఇతర కేటగిరీలకు చెందిన 1,200 పోస్టులు ఉన్నాయి. పరిపాలన సంబంధ పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా గుర్తించిన బోధన సిబ్బంది పోస్టులన్నీ కలిపి.. 10 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం.

నూతన జోనల్‌ విధానంపై అస్పష్టత

రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు వచ్చేనాటికి గురుకులాల్లో దాదాపు 7 వేలకు పైగా పోస్టులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటి నియామకాలు చేపట్టాలని గురుకుల బోర్డు భావించినా.. నూతన జోనల్‌ విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. సొసైటీలకు నిబంధనలు వర్తిస్తాయా? లేదా? అన్న విషయమై సాధారణ పరిపాలన శాఖతో పలుమార్లు చర్చించింది. నూతన జోనల్‌ విధానం మేరకు సర్వీస్‌ నిబంధనలు, పోస్టుల వర్గీకరణ రూపొందించి.. ప్రతిపాదనలనూ సిద్ధం చేసుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన వెంటనే నియామక ప్రకటనలు వెలువడే అవకాశాలున్నాయని సొసైటీలు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details