తెలంగాణ

telangana

ETV Bharat / city

మిలమిల మెరిసే పుట్టగొడుగులోచ్‌! ఎక్కడో చూడాలనుకుంటున్నారా?

‘అదో అడవి... చిమ్మ చీకటి.. ఉన్నట్టుండి ఏదో వెలుగు..! ఏంటబ్బా అని చూస్తే కుప్పలుతెప్పలుగా కాంతిని వెదజల్లుతున్న పుట్టగొడుగులు..’ ‘ఆ.. ఏముందిలే అదంతా ఏదో సినిమాలో సెట్టింగో.. లేకపోతే ఏ గ్రాఫిక్సో అయి ఉంటుందిలే’ అని తేలిగ్గా తీసుకోకండి. అవన్నీ ప్రకృతి సిద్ధమైన పుట్టగొడుగులు.. ఎక్కడో విదేశాల్లో కాదు.. మన దగ్గరా ఉన్నాయివి. మరి వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందామా!

By

Published : Apr 25, 2021, 9:36 AM IST

twincle twincle shiny mushroom in megahlaya
మేఘాలయలోని జైంతియా హిల్స్‌లో ఈ మెరిసే పుట్టగొడుగులు

మేఘాలయలోని జైంతియా హిల్స్‌లో ఈ మెరిసే పుట్టగొడుగుల ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. సైంటిస్టులైతే ఇప్పుడు గుర్తించారు కానీ స్థానికులకు మాత్రం వాటి గురించి ఎప్పటి నుంచో తెలుసు. వాళ్లు ఎంచక్కా ఇవి పెరిగిన వెదురు కర్రలను చీకట్లో దారి చూపే టార్చిలైట్లగానూ వాడేస్తున్నారు! నిజానికి పుట్టగొడుగుల్లో దాదాపు 1,20,000 రకాలున్నాయి. కానీ ఇందులో కేవలం 100 రకాలు మాత్రమే వెలుగులు వెదజల్లగలవు.

మేఘాలయలోని జైంతియా హిల్స్‌లో ఈ మెరిసే పుట్టగొడుగులు

ఎలా తెలిసిందంటే..

గత ఏడాది వర్షాకాలంలో భారత్‌, చైనా నుంచి బృందాలు పుట్టగొడుగుల మీద పరిశోధనలకు బయలు దేరాయి. ఈ క్రమంలో వాళ్లు కొన్ని వందల రకాల పుట్టగొడుగులను గుర్తించారు. ఇందులో కొన్ని పూర్తిగా కొత్తవి. మెరిసే పుట్టగొడుగుల గురించి స్థానికుల నుంచి తెలుసుకుని సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. తర్వాత వాటిని వెతుక్కుంటూ మేఘాలయలోని జైంతియా హిల్స్‌కు చేరుకున్నారు.

అవాక్కయ్యేలా..

ఓ స్థానికుడి సాయంతో శాస్త్రవేత్తలు రాత్రిపూట వెదురు వనానికి వెళ్లారు. ఒక్కసారిగా వాళ్లదగ్గర ఉన్న టార్చిలైట్లను ఆర్పేశారు. అంతే.. చుట్టుపక్కల అంతా కాంతులు వెదజల్లుతూ పుట్టగొడుగులు దర్శనమిచ్చాయి. ఇంతకు ముందు వీటిని మేఘాలయలోనే ఉన్న ఖాసి హిల్స్‌లోని మావ్లినాంగ్‌లో గుర్తించారు. తర్వాత ఇవి జైంతియా హిల్స్‌లో కనిపించాయి.

వెదురు మీదే..

ఈ వెలుగుల పుట్టగొడుగులకు ఓ ప్రత్యేకత ఉంది. ఇవి కేవలం ఎండిపోయి వర్షానికి తేమ నిండిన వెదురు కర్రల మీదే పెరుగుతాయి. అచ్చం ఇలాగే వెలిగే పుట్టగొడుగులు పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, కేరళ, మహారాష్ట్ర, గోవాల్లో కూడా ఉన్నాయంటారు. కానీ ఇంకా వీటిపై శాస్త్రీయంగా అధ్యయనం జరగలేదు. మరింత లోతుగా పరిశోధనలు జరిగితే మన దేశంలో మరిన్ని రకాల వెలుగుజిలుగుల పుట్టగొడుగుల రకాలు బయటపడే అవకాశం ఉందని కొందరు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. నేస్తాలూ! మొత్తానికి ఇవీ కాంతులు వెదజల్లే పుట్టగొడుగుల విశేషాలు.

ఇదీ చూడండి:పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం : కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details