తెలంగాణ

telangana

ETV Bharat / city

'పట్టా'లెక్కని ప్రగతి - telangana railway

ఎన్ని బడ్జెట్లు వస్తున్నా.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. తెలంగాణలో రైల్వేలు ఆశించిన రీతిలో ప్రగతి ‘పట్టా’లెక్కడం లేదు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం రైలు మార్గాల విషయంలో మాత్రం వెనుక‘బాట’లోనే ఉంది. కొత్త లైన్ల కోసం.. మెరుగైన సౌకర్యాల కోసం ఎన్నో డిమాండ్లు వస్తున్నా వాటికి అతీగతీ ఉండటం లేదు.

telangana state lacks in  railway development
'పట్టా'లెక్కని ప్రగతి

By

Published : Jan 31, 2020, 7:29 AM IST

ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించిన తెలంగాణ రైల్వే ప్రగతి మాత్రం ఆశించిన రీతిలో అభివృద్ధి చెందడం లేదు. రైల్వేశాఖ సర్వేలకు ఆమోదం తెలపడంతోనే సరిపెట్టుకుంటోంది. కొత్త లైన్లు వేయడమూ లేదు.. ఉన్న లైన్లను విస్తరించడమూ లేదు. దేశవ్యాప్తంగా రైలు మార్గాల్లో తెలంగాణ సగటు 2.7 శాతం మాత్రమేనంటే పరిస్థితి ఏ రీతిలో ఉందో స్పష్టమవుతోంది. బడ్జెట్‌కు ముందు ఏటా ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే సమావేశాలు నిర్వహిస్తుంది. వారి నుంచి విజ్ఞప్తులు తీసుకుంటున్నా.. తర్వాత అవి బుట్టదాఖలవుతున్నాయి. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో అయినా తెలంగాణకు ప్రాధాన్యమివ్వాలని ప్రజలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు.

కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోని గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు కొత్తగా ఏర్పడే జోన్‌లోకి వెళ్లనున్నాయి. దీంతో ఇక ద.మ.రైల్వేలో మిగిలేది సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్‌ డివిజన్‌ మాత్రమే. తెలంగాణలో రెండు డివిజన్లే మిగిలే అవకాశం ఉండటంతో కొత్తగా కాజీపేట డివిజన్‌ ఏర్పాటు చేయాలని, బడ్జెట్‌లో దీన్ని ప్రకటించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.

* కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ 1980ల్లోనే మంజూరైనప్పటికీ ఆ తర్వాత పంజాబ్‌కు తరలించారు. ఇకనైనా కొత్త కోచ్‌ఫ్యాక్టరీని మంజూరు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

నిధులు విదిలించేదెప్పుడు!

అక్కన్నపేట-మెదక్‌ (కేవలం 17 కి.మీ.లు) రైల్వేలైను 2012-13లో మంజూరైంది. ఏడేళ్లైనా ఇంకా పనులు చివరి దశలో ఉన్నాయి. అలాగే మరికొన్ని కొత్త మార్గాలకు భారీగా నిధులు కేటాయించాల్సి ఉంది. అవి..

  • మనోహరాబాద్‌-కొత్తపల్లి
  • భద్రాచలం-సత్తుపల్లి
  • కాజీపేట-బలార్ష (మూడోలైను)
  • ఘట్‌కేసర్‌-యాదాద్రి
  • ఉందానగర్‌-మహబూబ్‌నగర్‌ (డబ్లింగ్‌)

ఎంపీల ప్రధాన డిమాండ్లు

  1. కాజీపేట-కరీంనగర్‌(హుజూరాబాద్‌ మీదుగా)కొత్త లైను.
  2. ఉందానగర్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనుల వేగవంతం. (గత డిసెంబరులోనే పూర్తికావల్సి ఉన్నా పనులు సాగుతూనే ఉన్నాయి.)
  3. కాజీపేట పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ (కాలానుగుణంగా చేయాల్సిన నిర్వహణ, మరమ్మతుల) ప్రాజెక్టుకు నిధులిచ్చి.. పనులు ప్రారంభించాలి.
  4. సికింద్రాబాద్‌ నుంచి నిజామాబాద్‌ మీదుగా దిల్లీకి రైలు సదుపాయం.
  5. గద్వాల-వనపర్తి కొత్త రైల్వే లైను నిర్మాణం.
  6. 20ఏళ్ల క్రితం మంజూరై పక్కనపెట్టిన నల్గొండ-మాచర్ల లైనుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలి.
  7. సికింద్రాబాద్‌-కాజీపేట మూడోలైను.
  8. హైదరాబాద్‌ శివారులో ముంబయి వైపు నాగులపల్లి వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ రైల్వే టెర్మినల్‌ ఏర్పాటు.

సర్వేలతోనే సరా..!

సికింద్రాబాద్‌ నుంచి ముంబయి వైపు.. అలాగే సికింద్రాబాద్‌-గుంటూరు మార్గంలో బీబీనగర్‌-నల్లపాడు మధ్య సింగిల్‌ లైన్లే ఉన్నాయి. సికింద్రాబాద్‌-బెంగళూరు మార్గంలోనూ చాలామేర సింగిల్‌ లైనే ఉంది. నల్లపాడు-బీబీనగర్‌ 243 కి.మీ.ల మార్గంలో రెండోలైను వేయడానికి మంజూరు చేసిన సర్వేను పూర్తి చేయడానికి రెండేళ్ల సమయం తీసుకుని, ఏ నిర్ణయం తీసుకోకుండా పక్కనపెట్టేశారు. ఈ మార్గాల్లో రెండో లైన్లు మంజూరు చేస్తే తెలంగాణ నుంచి ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకల వైపు రాకపోకలు సులభమవుతాయి.

జనగాం తర్వాత వచ్చే ఘన్‌పూర్‌ స్టేషన్‌ నుంచి పాలకుర్తి, కొడకండ్ల మీదుగా సూర్యాపేట వరకు 170 కి.మీ.ల మేర రైల్వేలైను కోసం ఐదేళ్ల క్రితం సర్వే మంజూరు చేశారు. గడువును పలుమార్లు పెంచారు. తర్వాత అతీగతీ లేదు.

సూర్యాపేట మీదుగా విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రైలుమార్గం లేదు. జాతీయ రహదారిని ఆనుకుని మచిలీపట్నం పోర్టు వరకు హైస్పీడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

రూ. 2,800 కోట్ల వ్యయం.. 220 కి.మీ.ల ఆర్మూర్‌-నిర్మల్‌-ఆదిలాబాద్‌ మధ్య కొత్త రైల్వేలైను.. కేంద్రం మూడేళ్ల కిందట దీన్ని ప్రకటించింది. ఆ తర్వాత బడ్జెల్‌లో రూపాయి కూడా కేటాయించ లేదు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా వెనుకబడి ఉంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 9,167 రూ.కి.మీ.ల రైలు మార్గాలుండగా.. రాజస్థాన్‌లో 5,894, మహారాష్ట్రలో 5,784, గుజరాత్‌లో 5,259, పశ్చిమబెంగాల్‌లో 4,139, తమిళనాడులో 4,028, ఆంధ్రప్రదేశ్‌లో 3,817 రూ.కి.మీ.ల మేర ఉన్నాయి. ఆఖరికి చిన్న రాష్ట్రమైన ఝార్ఖండ్‌లో కూడా 2,455 రూ.కి.మీ.లు ఉండగా తెలంగాణాలో ఆ సంఖ్య కనీసం 2వేలు దాటనే లేదు.

ABOUT THE AUTHOR

...view details