తెలంగాణ

telangana

ETV Bharat / city

జాతీయ మీడియా ఎండగట్టినా మీరు మారరా..?: చంద్రబాబు - అమరావతి పరిరక్షణ

ఏపీ రాజధాని అమరావతిపై.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి తప్పుబట్టారు. సీఎం తీరును.. జాతీయ మీడియా ఎండగట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతి పరిరక్షణ.. 5 కోట్ల ఆంధ్రుల బాధ్యతగా చెప్పారు.

CHANDRA BABU
CHANDRA BABU

By

Published : Feb 3, 2020, 8:47 PM IST

Updated : Feb 3, 2020, 10:10 PM IST

అమరావతి పరిరక్షణ 5 కోట్ల ప్రజల బాధ్యత: చంద్రబాబు

అమరావతి పరిరక్షణ 5 కోట్ల ప్రజల సమష్టి బాధ్యత అని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఈ రాష్ట్రం ఏమవుతుందో.. ఎక్కడికి పోతుందో.. ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. 3 రాజధానులు సరికాదని జాతీయ మీడియా ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్‌ సంపాదకీయం రాసిన విషయాన్ని గుర్తు చేశారు. నియంతృత్వ పోకడలు సరికాదని టెలిగ్రాఫ్‌ పత్రిక రాసిందన్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు వెనక్కి వెళ్లడం రాష్ట్రానికి మంచిదికాదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. దేశంలోని ప్రముఖ జాతీయ పత్రికలు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తీరును తప్పుబట్టాయన్న చంద్రబాబు... అమరావతి విషయంలో ఏపీ సీఎం తీరును జాతీయ మీడియా విమర్శిస్తోందని చెప్పారు.

దక్షిణాఫ్రికాలో తప్ప ఎక్కడా లేవు

''స్థానికులకే ఉద్యోగాలు, పీపీఏల రద్దు, 3 రాజధానులపై జగన్ తీరును ఆక్షేపించాయి. 3 రాజధానులపై ద హిందూ, ద ట్రిబ్యూన్‌, ద ప్రింట్‌ పత్రికలు విమర్శించాయి. ప్రపంచంలో దక్షిణాఫ్రికాలో తప్ప ఎక్కడా 3 రాజధానులు లేవు. ఏపీ సీఎం పాలన తుగ్లక్‌ను తలపిస్తోందని జాతీయ మీడియా అభివర్ణించింది. 3 చోట్లకు తిరిగేందుకు ఖర్చులు పెరుగుతాయి. 3 రాజధానులుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడకు వెళ్లాలి? సమయం, ఖర్చు గురించి ఆలోచించారా? అధికార వికేంద్రీకరణ, కార్యాలయాలు కట్టినంత మాత్రాన అభివృద్ధి జరగదు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పెట్టుబడులు వెనక్కి...

వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల అదానీ డేటా సెంటర్, లులు, పేపర్ మిల్ సహా ఎన్నో సంస్థలు ఏపీని విడిచిపోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కియా అనుబంధ పరిశ్రమలు వేరేచోట్లకు మళ్లాయని వెల్లడించారు. ప్రభుత్వ చర్యల వల్ల రూ.79 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని మండిపడ్డారు. అలాగే అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను విమర్శించి.. అక్కడెలా చేస్తారని ప్రశ్నించారు.

అమరావతి రైతులపై మీకు ఎందుకంత కక్ష?

"ఉత్తరాంధ్ర, రాయలసీమకు ద్రోహం చేసిందెవరు? గుండ్రేవుల, వేదవతి, రాజోలిబండ, భైరవాని తిప్ప ప్రాజెక్టులు ఆపేశారు. సాగునీటి ప్రాజెక్టులకు 9నెలల్లో రూపాయైనా ఖర్చు పెట్టారా? మీరు చేస్తున్న పనులకు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి. సీఎస్‌ స్థాయి వ్యక్తిని బాపట్లకు పంపించడం దారుణం. పీపీఏల సమీక్ష వద్దని కేంద్రం చెప్పినా వీళ్లు వినలేదు. కక్ష సాధింపు, విద్వేషం తప్ప మీకు పాలనపై దృష్టి లేదు. కక్షలు, కార్పణ్యాలకు ఇది సందర్భమా? అమరావతిలో 10 వేల ఎకరాల భూమి నుంచి రూ.2లక్షల కోట్ల సంపద వచ్చేది. అమరావతి రైతులపై మీకు ఎందుకంత కక్ష? విశాఖ, కర్నూలులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి" అని చంద్రబాబు సూచించారు.

హోదా గురించి ఎప్పుడైనా మాట్లాడారా?

"వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల్లో రూ.72 వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. పన్ను వసూళ్లు బాగా తగ్గిపోయాయి. అప్పులు మాత్రం 16 శాతం పెరిగాయి. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం కూడా 6 శాతం పెరిగింది. మీ చేతకాని విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు ఎందుకు నిధులివ్వలేదు? విద్యార్థులకు ఈ ఏడాది ఉపకార వేతనం ఇచ్చారా? అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా మాట్లాడారా? మనకు రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని అడిగారా? కుంటిసాకులు చెప్పి అన్ని పథకాల్లో కోతలు పెడుతున్నారు. చివరికి అన్నీ రద్దు చేసి రైతు భరోసా ఇచ్చారు.. దానిలోనూ అనేక నిబంధనలు పెట్టారు. అధికారంలోకి వచ్చాక గుత్తేదారులకు రూపాయి అయినా చెల్లించారా? కేంద్రం చెప్పినా, కోర్టులు విమర్శించినా మీరు మారరా?" అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇదీ చూడండి:వినూత్న నిరసన... వివాహ పత్రికపై సేవ్ అమరావతి

Last Updated : Feb 3, 2020, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details