ASANI Effect: అసని' తుపాను మచిలీపట్నం తీరం దగ్గరగా వాయుగుండంగా బలహీనపడిందని ఏపీ విపత్తుల సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ తెలిపారు. గత ఆరు గంటల పాటు స్థిరంగా ఉండి అక్కడే బలహీనపడిందన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-55 కిమీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. తుపాన్ బలహీనపడినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసని ప్రభావంతో కురిసిన వర్షాలకు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి.
నెల్లూరు: అసని తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వానపడుతోంది. రాత్రి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు, అనంతసాగరం, సంగం, ఏఎస్ పేట, చేజర్ల, మర్రిపాడు మండలాల్లో వాన కురిసింది. వరద నీటితో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
కందుకూరు మండలంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగుతున్నాయి.రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంటర్ పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎర్రవాగు, ఉప కాలువలు పొంగి కందుకూరు నుంచి గోపాలపురం, షామిరిపాలెం, పాలురు, ఆనందపురం గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కందుకూరు -కొండముడుసుపాలెం మధ్య ఎర్రవాగు ఉధృతిగా ప్రవహిస్తోంది. రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కందుకూరు, శామిర్ పాలెం మధ్య వాగు పొంగి ప్రవహించడంతో ఇంటర్ పరీక్షలు నలుగురు విద్యార్థులను పోలీసులు క్షేమంగా పరీక్షా కేంద్రాలకు చేర్చారు.
తుఫాను ప్రభావంతో ఉదయగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పంట పొలాలు నీట మునిగాయి. కనిగిరి-కావాలి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కొండాపురం మండలం రామానుజపురంలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వర్షం కురుస్తుండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులుపడ్డారు. ఉలవపాడు మండలం వీరేపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలుగుదేశం నేతలు పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. నెలరోజుల క్రితమే ధాన్యం తీసుకొచ్చినా...వర్షాలు వచ్చే వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేయాల్సిందేనని లేదంటూ ఆందోళనకు దిగుతామని తెలుగుదేశం నేతలు హెచ్చరించారు..