వేతన సవరణ సంఘం నివేదిక తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని... దాన్ని చెత్తబుట్టలో వేసినట్లేనని టీఎన్జీఓ, టీజీఓ సంఘాలు తెలిపాయి. పీఆర్సీ నివేదికపై టీఎన్జీఓ, టీజీఓ, సచివాలయ సంఘం ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని అధికారుల కమిటీ చర్చలు జరిపింది. ఆయా సంఘాల అభిప్రాయాలు, విజ్ఞప్తులను తీసుకొంది. కమిషన్ నివేదించిన ఏడున్నర శాతం ఫిట్మెంట్ను ఉద్యోగులు జీర్ణించుకోవడం లేదని... పీఆర్సీ పే రిడక్షన్ కమిటీగా, పిసినారి కమిటీగా మారిందని వ్యాఖ్యానించారు.
మెరుగైన పీఆర్సీ సాధిస్తాం
కమిషన్ కేవలం సిఫార్సులు చేసిందన్న ఉద్యోగ సంఘాల నేతలు... ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి మెరుగైన పీఆర్సీ సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన 43 శాతం కంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. మంత్రులను కలుస్తామని, లాబీయింగ్ చేస్తామని... ముఖ్యమంత్రిని ఒప్పించి మెరుగైన ఫిట్‌మెంట్ సాధిస్తామన్నారు. నెలాఖరులో పదవీ విరమణ చేసే వారికి కూడా వయసు పెంపు వర్తించాలని కోరినట్లు చెప్పారు.