తెలంగాణ

telangana

ETV Bharat / city

సున్నా జోడించారు.. రాయితీల సంగతి మరిచారు!

సామాన్యుల నుంచి సంపన్నులవరకూ అందరికీ ప్రయాణ వనరుగా రైల్వేకు పేరుంది. ఆ గుర్తింపునకు తగ్గట్టే వివిధ వర్గాలను గౌరవించడంలో కూడా ముందుండేది. కరోనా ఆ పేరును తుడిచేసింది. రైలు నంబరుకు ముందు ‘సున్నా’ జోడించి  ప్రత్యేక రైళ్లపేరుతో 51 రాయితీలకు తిలోదకాలిచ్చింది. ఏడాది కావొస్తున్నా.. నిత్యం నడిచే రైళ్ల సంఖ్య పెరుగుతున్నా.. రాయితీల పునరుద్ధరణను గాలికొదిలేసింది.

no discount in Indian railways after lockdown
ప్రత్యేక రైళ్లపేరిట దగా

By

Published : Mar 1, 2021, 7:16 AM IST

ప్రస్తుతం రైల్వే నడుపుతున్న ప్రత్యేక రైళ్లన్నీ గతంలో సాధారణ రైళ్లే. ఉదాహరణకు హైదరాబాద్‌ - విశాఖపట్నం - హైదరాబాద్‌ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు నంబరునే పరిశీలిస్తే.. కరోనాకు ముందు.. 12728, 12727 నంబర్లతో నడిచేవి. ముందు ‘సున్నా’ జోడించి (012728, 012727) దానిని ప్రత్యేక రైలుగా చేసేశారు. లాక్‌డౌన్‌ తర్వాత మే 11 నుంచి రైళ్లు పట్టాలెక్కాయి. ఆ తర్వాత క్రమంగా దక్షిణ మధ్య రైల్వేలో తిరిగే రైళ్ల సంఖ్య 170 దాటింది. ఏప్రిల్‌ 1 నుంచి మరిన్ని రైళ్లు తోడవుతున్నాయి. వీటిలో 150 వరకు నగరం మీదుగా రాకపోకలు సాగించేవి ఉన్నాయి. కరోనాకు ముందు 300 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ద.మ. రైల్వే పరిధిలో తిరగ్గా.. దాదాపు 200 వరకు ప్రస్తుతం గాడిలో పడ్డాయి. రైళ్ల సంఖ్య పెరిగినా రాయితీల ఊసును మాత్రం రైల్వేశాఖ ఎత్తడం లేదు.

మొత్తం 51 రాయితీలు

  • శారీరక దివ్యాంగులు, మానసిక ఇబ్బందులున్నవారికి 50 శాతం రాయితీతో ప్రయాణ వసతి కల్పించడమే కాదు వీరికి తోడుగా ఉన్న వారికి కూడా అదే టిక్కెట్‌ వర్తించేది.
  • క్యాన్సర్‌, తలసేమియా, హృద్రోగం, క్షయ, ఎయిడ్స్‌ ఇలా 9 రకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారితో పాటు సహాయకులుగా ఉన్న వారికి 75 శాతం నుంచి 50 శాతం రాయితీ ఉండేది.
  • 60 ఏళ్లు దాటిన పురుషులకు, 58 ఏళ్లు దాటిన మహిళలకు టిక్కెట్‌ ధరపై రాయితీ కల్పించేవారు.

రాష్ట్రపతి పోలీసు పతకం, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందినవారు, యుద్ధరంగంలో మృతి చెందిన జవాన్ల భార్యలు, విజ్ఞాన యాత్రలు చేసే విద్యార్థులు, యువజన ఉత్సవాలకు వెళ్లే యువతీ యువకులకు, వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనకు వెళ్లే రైతులు, కార్మికులు, కళాకారులు, వైద్య నిపుణులు, జర్నలిస్టులు, అంతర్రాష్ట్ర, జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లే క్రీడాకారులకు.. ఇలా మొత్తం 51 రకాల రాయితీను రైల్వే ఇచ్చేది. నెలసరి ఆదాయం ఆధారంగా అసంఘటిత రంగ కార్మికులకు 100కిలోమీటర్ల వరకు రూ.25కే ప్రయాణ అవకాశం కల్పించేవారు. ఇప్పుడివేవీ అమలు కావడం లేదు.

ABOUT THE AUTHOR

...view details