ఆ ఉదయం బెడ్ దిగలేదింకా. ఫోన్ అదేపనిగా మోగితే ఎత్తా. ‘హలో’ అంటూ అవతలివైపు ఆడ గొంతు. పైగా కొత్త నెంబర్. నేను అయోమయంలో ఉండగానే ‘హ్యాపీ బర్త్‌డే’ అంది. థాంక్స్ చెప్పి ఎవరన్నా? ‘నీకున్న ఏకైక ఆడ ఫ్రెండుని. నన్ను గుర్తు పట్టలేదా?’ అంది. అప్పుడు వెలిగింది బల్బు. తను నా కొలీగ్.
అమ్మాయిలని చూస్తేనే నాకు జంకు. వాళ్లు దగ్గరికొస్తే చెమట్లు పట్టేవి. బీటెక్‌లో నా స్నేహితులందరికీ లవర్స్ ఉంటే నాకు ఒక్క ఆడ ఫ్రెండూ లేదు. తప్పనిసరై ఏ అమ్మాయితోనైనా మాట్లాడాల్సి వస్తే మధ్యవర్తిగా ఎవరైనా అబ్బాయిని పెట్టుకునేవాణ్ని.
బీటెక్ పూర్తవగానే ఓ ప్రభుత్వాఫీసులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా చేరా. అక్కడ నాకో మిత్రుడు ఉండేవాడు. ‘అందరితో కలుపుగోలుగా ఉంటేనే ఇక్కడ పనవుతుందిరా’ అన్నాడు మొదటిరోజే. తర్వాత క్వాలిటీ విభాగంలో పని చేసే ఒకమ్మాయిని పరిచయం చేశాడు. బెరుకు వదిలి తనతో బాగానే మాట్లాడా. కానీ రెండో రోజే ఆ ధైర్యం నీరుగారిపోయింది. మళ్లీ టచ్ మీ నాట్‌లా మొక్కలా ముడుచుకుపోయా. తను కళ్లతో పలకరిస్తే నా చూపులు నేలలోకి దిగేవి. తను చేయి ఊపితే నేను బిగుసుకుపోయేవాణ్ని. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. ‘మీ ఫ్రెండ్‌కి పొగరు ఎక్కువ. పలకరించినా పట్టించుకోడు’ అందట నా స్నేహితుడితో. ఓరోజు ధైర్యాన్ని కూడదీసుకొని వెళ్లి నా సమస్యేంటో వివరించా. అప్పుడర్ధం చేసుకుంది. నా భయం పోగొట్టేలా ఎప్పుడూ తనే ముందు మాట కలిపేది. అలా అలా మామధ్య స్నేహం చిగురించింది. ఇక ఆరోజు ఉదయం ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది తనే. అదే మొదటిసారి మేం ఫోన్లో మాట్లాడుకోవడం. ఆఫీసుకు వెళ్లాక షేక్‌హ్యాండ్ ఇచ్చి ఒక ఖరీదైన పెన్ను, చాక్లెట్ చేతిలో పెట్టింది. ఒకమ్మాయి నాపై అంతలా ఆసక్తి చూపించడం.. అంతా కొత్తగా, కొంచెం గర్వంగా అనిపించింది. నేను జీవితంలో అందుకున్న తొలి బహుమతి అది.
తనతో సాన్నిహిత్యం పెరిగేకొద్దీ అమ్మాయిలతో స్నేహంలో ఉండే మజా ఏంటో అర్థం కాసాగింది. ఆఫీసుకు రాగానే భక్తుడిలా తనని దర్శించుకునే వాణ్ని. ఓ చిరునవ్వు, కొన్ని మాటల్ని వరమిచ్చేది. ఇళ్లకి వెళ్లిపోగానే మా ఫోన్లు మోగేవి. అప్పుడప్పుడు తను నాకోసం ప్రత్యేకంగా చికెన్, చేపలు వండుకొని మరీ తీసుకొచ్చేది. నా అదృష్టానికి సహోద్యోగులు కుళ్లుకునేవాళ్లు. ఇక పొరపాటున నేను వేరే అమ్మాయితో మాట్లాడితే చాలు.. తను కళ్లెర్రజేసేది. ఒకప్పుడు ఏ అమ్మాయీ ఎదురుపడొద్దని కోరుకున్న నేను... తను పక్కన లేకపోతే ఉండలేనేమో అనే స్థితికి వచ్చా.
అలా జాలీగా గడిచిపోతున్న నా జీవితంలోకి లాక్‌డౌన్ శనిలా దాపురించింది. పరిస్థితులు బాగా లేకపోవడంతో ఊరెళ్లిపోయా. చాలారోజుల తర్వాత వెళ్లడంతో కుటుంబం, బంధువుల ధ్యాసలో పడిపోయా. తనకి పెద్దగా ఫోన్ చేసేవాణ్ని కాదు.. ఆమె చేసినా కొన్ని సార్లు తీయలేదు. ఏమైందో.. కొద్దిరోజులకు వాట్సప్ డిలీట్ చేసింది. ఎందుకలా చేశావంటే ‘ఎవరితోనూ చాటింగ్ చేసే అవసరం రావట్లేదుగా’ అంది. తన మాటల్లోని లోతుని అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. తనే ఫోన్ చేస్తుందిలే అనే పొగరో.. నేను చేస్తే బాగుండదేమో అనే మొహమాటమో.. మొత్తానికి మెల్లమెల్లగా తనకి దూరం కాసాగా. ఇంకొన్నాళ్లకి మా మధ్య మాటలు పూర్తిగా తెగిపోయాయి.
ఇప్పుడు మళ్లీ ఒంటరినైపోయా. సంతోషమొస్తే పరుగెత్తుకెళ్లి చెప్పడానికి తను నా పక్కన లేదు. పొరపాటు చేస్తే నాలుగు మొట్టికాయలు వేసి ‘ఇలా చేయాలి’ అని చెప్పడానికి ఆమె రావడం లేదు. నాకు అసలేమీ తోచడం లేదు. మనసంతా ఏదో తెలియని బాధ. మొదట్లో ఏ అమ్మాయి పట్లా నాకెలాంటి ఫీలింగ్స్ కలగొద్దని కోరుకున్నా. ఇప్పుడు నా ఫీలింగ్స్ పంచుకునే ఒక్కగానొక్క అమ్మాయిని చేజేతులారా వదులుకున్నానని వగస్తున్నా. తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు. నా తప్పిదాన్ని తను మన్నిస్తుందని ఆశిస్తున్నా.
మన్నించు నేస్తం.. నువ్వే సమస్తం.. - friendship news
నాకు కష్టమొస్తే తను ఓదార్పయ్యేది. నా పెదాలు విచ్చుకున్నాయంటే తనే కారణమయ్యేది. అసలు తను నా తలపుల్లోకి రాకుండా రోజే గడిచేది కాదు. అలాంటి తను ఇప్పుడు నా పక్కన లేదు. ఎందుకంటే..?
friend