పురపాలక ఎన్నికల ముందస్తు ప్రక్రియ ఇవాళ్టితో దాదాపుగా పూర్తి కానుంది. వార్డుల వారీ ఓటర్ల తుదిజాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించనుంది. ఎన్నికలు జరగనున్న పది కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో వార్డుల వారీ ఓటర్ల ముసాయిదా జాబితాను గత నెల 30వ తేదీన విడుదల చేశారు. అదే రోజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. ఓటర్ల జాబితాతో పాటు ఓటర్ల గుర్తింపు పరంగా తప్పులు దొర్లాయంటూ చాలా ఫిర్యాదులు వచ్చాయి. దాదాపుగా అన్ని చోట్లా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం 2,700కు పైగా అభ్యంతరాలు, వినతులు వచ్చినట్లు సమాచారం.
ఓ వర్గానికి ఎన్ని పదవులు...
వాటన్నింటిని అధికారులు పూర్తి చేశాక తుదిజాబితాలు ప్రకటించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది వివరాలు కూడా ఇవాళ వెల్లడవుతాయి. వాటి ఆధారంగా మేయర్, ఛైర్మన్ పదవుల, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఏ వర్గానికి ఎన్ని పదవులు రిజర్వ్ అవుతాయన్న విషయమై ఇవాళ స్పష్టత రానుంది. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని తెలిపారు. ఆ తర్వాత 50 శాతానికి మించకుండా బీసీ రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎస్టీలకు మూడు శాతం వరకు, ఎస్సీలకు 12శాతం వరకు రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది. 50శాతంలో మిగిలిన రిజర్వేషన్లు బీసీలకు దక్కుతాయి.