భాజపా నేతలు అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో తమకు ఏ పార్టీతో పొత్తు లేదని... పొత్తు తెలంగాణ ప్రజలతోనేనని ఆయన అన్నారు. కాంగ్రెస్, భాజపాలది చీకటి ఒప్పందమని.. తెరాసకు వ్యతిరేకంగా ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపాకు సహకరిస్తోందని ఆరోపించారు. నిజామాబాద్, కరీంనగర్, దుబ్బాకలో ఒకరికొకరు సహకరించుకున్నారని పేర్కొన్నారు. వరదలపై కూడా ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వరద సహాయం నిలిపేయాలని భాజపా, కాంగ్రెస్ రెండు పార్టీలు లేఖలు రాశాయని... ఇప్పుడు తాము రాయలేదని డ్రామాలాడుతున్నారని అన్నారు. రెండు పార్టీలకు ప్రజలపై ప్రేముంటే వరద సహాయం అందించాలని మరోమారు లేఖ రాయాలన్నారు. కేసీఆర్‌ను ఉగ్రవాది, దేశద్రోహి అన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
గుజరాత్, యూపీలో చలానాలు భాజపా ప్రభుత్వాలే కడుతున్నాయా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి చలానాలు వేస్తారని... ఆ తప్పు చేసిన వారికి భాజపా అండగా ఉంటుందా అని నిలదీశారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అసదుద్దీన్తో మోదీ ఎందుకు సమావేశమయ్యారో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. దేవుళ్ల పేరుతో ఓట్లు అడుక్కోవడం భాజపాకు అలవాటుగా మారిందన్నారు. జీహెచ్‌ఎంసీలో వంద సీట్లకు పైనే గెలిచి.. సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామన్నారు. కేసీఆర్ హైదరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నారని... బండి సంజయ్ తన లేఖ ఫోర్జరీ అయితే పీఎస్కు వెళ్లాలి కాని.. గుడికి కాదన్నారు. అప్రమత్తంగా లేకపోవడం వల్లే దుబ్బాకలో ఓడిపోయామన్నారు.