తెలంగాణ

telangana

ETV Bharat / city

లాక్​డౌన్​ను రోడ్ల మరమ్మతులకు వాడుకోండి: కేటీఆర్​

కోరనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పురపాలక శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్​ సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతు, రూ.5 భోజనం, సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల వినియోగం, ఇంటర్​ నెట్​ బ్యాండ్​ విడ్త్​ పెంపుతో పాటు అనేక అంశాలపై చర్చించారు.

By

Published : Mar 24, 2020, 11:09 PM IST

Updated : Mar 24, 2020, 11:37 PM IST

KTR Review on municipal, it and industrial departments
లాక్​డౌన్​ను రోడ్ల మరమ్మత్తులకు వాడుకోండి

మున్సిపల్​, ఐటీ, పరిశ్రమల శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్​ టెలీకాన్ఫిరెన్స్​ నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్రంలో లాక్​డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాడైపోయిన రోడ్ల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు.

ఇళ్లు లేని వారిని..

రూ.5 భోజనం కొనసాగించాలని సూచించారు. కౌంటర్ల వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇళ్లు లేని వారిని ఆయా పట్టణాల్లోని నైట్ షెల్టర్లకు తరలించాలన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్​లో ఉన్న వారు ఇళ్లకే పరిమితమయ్యేలా వారిపైన నిఘా ఉంచాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లను మంత్రి కోరారు.

సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు..

పారిశ్రామిక వాడల్లో, ఐటీ పార్కుల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులను కొనసాగిస్తూ.. మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అదేశించారు. ఈ మేరకు టీయస్​ఐఐసీ అధికారులు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలన్నారు. పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, రోజూవారీ కూలీల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను ఉపయోగించేందుకు ముందుకు రావాలని కేటీఆర్ కంపెనీలను కోరారు.

బ్యాండ్​ విడ్త్​ను పెంచండి..

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనందున ఇంటర్నెట్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది. డిమాండ్​ను తట్టుకునేందుకు అవసరమైన మేరకు బ్యాండ్​ విడ్త్​ను పెంచాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను మంత్రి విజ్ఞప్తి చేశారు. లాక్​డౌన్​ సందర్భంగా అత్యవసర సేవలతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తోన్న వారికి ఎదురవుతోన్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. వారి విషయంలో పోలీసు సిబ్బంది కొంత సానుకూలంగా వ్యవహరించేలా చూడాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిని కేటీఆర్‌ కోరారు.

ఇవీ చూడండి:జ్వరం వస్తే.. కరోనా పరీక్షలు చేయాల్సిందే

Last Updated : Mar 24, 2020, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details