తెలంగాణ

telangana

ETV Bharat / city

KP ONION: 'ఈ ఉల్లి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది'

ఏపీలోని కడప జిల్లా కృష్ణాపురంలో పండించే కేపీ ఉల్లి ప్రత్యేక వంగడమని యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర శాఖ పరిశోధకులు తెలిపారు. ఆచార్య పీఎస్‌ షావలీఖాన్‌ పర్యవేక్షణలో పలువురు పరిశోధకులు సంయుక్తంగా పరిశోధనలు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రత్యేక వంగడంగా గుర్తించి జియో ట్యాగ్‌ (భౌగోళిక పరమైన) ఇస్తే న్యాయపరమైన రక్షణ, రైతులకు ప్రయోజనం లభిస్తుందన్నారు.

international-reputation-for-kp-onions
కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి

By

Published : Jul 4, 2021, 9:56 AM IST

ఏపీలోని కడప జిల్లా మైదుకూరు మండలం కృష్ణాపురంలో పండించే కేపీ ఉల్లికి తనదైన ప్రత్యేకత ఉన్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర శాఖ పరిశోధకులు గుర్తించారు. ఈ వంగడాన్ని పరిరక్షించడానికి కణజాల వర్ధనంలో మొక్కలను ప్రయోగశాలలో సృష్టించారు. ఈ మేరకు ఆచార్య పీఎస్‌.షావలీఖాన్‌ పర్యవేక్షణలో డాక్టరు జి.విజయలక్ష్మి, ఇటలీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌, నేషనల్‌ రీసెర్చి కౌన్సెల్‌ పరిశోధకులు సంయుక్తంగా పరిశోధనలు చేశారు. వారి పరిశోధన పత్రం జర్నల్‌ ఆఫ్‌ బయాలాజికల్‌ సైన్సు స్ప్రింగర్స్‌లో జూన్‌ నెల సంచికలో ప్రచురించింది.

కేపీ ఉల్లి పంటను పరిశీలిస్తున్న ఆచార్య షావలీఖాన్‌

ఉల్లిపాయలు సహజంగా ఎరుపు, తెలుపు, పసుపు, ముదురు గోధుమ రంగుల్లో లభిస్తాయి. వివిధ దేశాల ఉల్లిని పరిశీలించినప్పుడు ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు కేపీ ఉల్లిలో ఎక్కువ ఉన్నట్లు పరిశోధనలో తేల్చారు. కేపీ ఉల్లి ప్రత్యేకించి ముదురు ఎరుపు రంగులో కలిగి ఉండటానికి అందులో ఉన్న ఆంథోసైనిన్‌(పుష్పనీలం) కారణమని గుర్తించారు. ఇవి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించారు. అందుకే ఇవి దేశవిదేశాలకు అత్యధికంగా ఎగుమతి అవుతుంటాయి. ఏ వంగడంలోనైనా కాలక్రమంలో తేజం, గడ్డల పరిమాణం తగ్గిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర శాఖ పరిశోధకులు ఉల్లి పుష్పాలను సేకరించి కణజాల వర్ధనంలో (టిష్యూకల్చర్‌) అతి శుద్ధమైన మొక్కలను ప్రయోగశాలలో సృష్టించారు. ప్రయోగశాలలో తయారు చేసిన మొక్కలతో ఉల్లిపాయ పరిమాణం పెంచేందుకు ప్రయోగం చేస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

జియోట్యాగ్‌ లభిస్తే ఎంతో లబ్ధి..

కేపీ ఉల్లి కడప జిల్లాకు చెందిన ప్రత్యేక వంగడమని యోవేవి వృక్షశాస్త్ర విభాగం ఆచార్యులు పీఎస్‌.షావలీఖాన్‌ తెలిపారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ కృష్ణాపురం ఉల్లిని ఈ ప్రాంతానికి చెందిన ప్రత్యేక వంగడంగా గుర్తించి జియో ట్యాగ్‌ (భౌగోళిక పరమైన) ఇస్తే న్యాయపరమైన రక్షణ లభిస్తుందని, రైతులకు ఎగుమతుల విషయంలో ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఇదీచదవండి:Dragon Fruit: ఉద్యోగాన్ని వదిలేసి.. డ్రాగన్​ఫ్రూట్​ సాగులో విజయం సాధించి..

ABOUT THE AUTHOR

...view details