తెలంగాణలో 2,216 మద్యం దుకాణాలతోపాటు 800లకుపైగా బార్లు, పబ్లు, క్లబ్బులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 159 కొత్త బార్ల ఏర్పాటుకు గత నెల 25న రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. ఈ నెల 10న ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ విధానంలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.
లాటరీ ద్వారా ఎంపిక
2011 జనాభా ఆధారంగా బార్లకు లైసెన్సు ఫీజులను ప్రభుత్వం నిర్దేశించింది. జీహెచ్ఎంసీతో పాటు ఉమ్మడి జిల్లాల వారిగా బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.30 లక్షలు, 50 నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతంలో రూ.42 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల మధ్య జనాభా కలిగిన ప్రాంతాల్లో రూ.44 లక్షలు.. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.49 లక్షలు లెక్కన లాటరీ ద్వారా ఎంపికైన వారు లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.