50 ఏళ్ల క్రితం..
1972లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఇక్రిశాట్ ఏర్పాటైంది. ఈ ప్రాంతంలో అంతకుపూర్వం కాచిరెడ్డిపల్లి, మన్మోల్ గ్రామాలుండేవి. వారిని ఖాళీ చేయించి దీనిని నిర్మించారు. ఆ సందర్భంగా తవ్వకాలు జరుపుతుండగా తొలుత అయిదు టన్నుల బరువున్న వినాయకుడి విగ్రహం లభించింది. హిందువులు ఏదైనా పని చేపట్టేందుకు విఘ్నాలు రాకుండా ఉండాలని వినాయకుడిని పూజిస్తారు. సంస్థ ప్రారంభంలోనే ఈ విగ్రహం లభించడంతో శుభసూచకంగా భావించారు. అప్పటి డైరెక్టర్ రాల్ఫ్ డబ్ల్యూ కమ్మిన్స్ చరిత్ర ఆనవాళ్లను వెలికితీసేలా తవ్వకాలు జరిపించారు. ఈ వినాయక విగ్రహం దాదాపు వెయ్యి ఏళ్ల క్రితందని గుర్తించారు. దీనిని జైనులు పూజించినట్లు శిల్పకళ ద్వారా తెలుస్తోంది.
ఆ తర్వాత వైష్ణవ శిల్పం, ద్వారపాలికలు, హనుమంతుడు, వీరగల్లు, వీరభద్రుడు, జైనయక్షిణులు.. ఇలా చాలా విగ్రహాలు లభించాయి. వీటిలో కొన్ని దెబ్బతిన్నాయి. 12వ శతాబ్దంలో వీరశైవం ప్రాభవమున్న సమయంలో జైనుల బసదుల స్థానాల్లో శైవాలయాలు నిర్మించినట్లు ఇక్కడి చరిత్ర చెబుతోంది. ఇక్రిశాట్ ఆవరణలో ఒక చెట్టు కింద ఉన్న ఆలయంలో జైనులు నిర్మించిన హోమగుండంతో పాటు శివుడి విగ్రహం ఉన్నాయి. సూర్యదేవాలయంతో పాటు మూడు, నాలుగు కిలోమీటర్ల పరిధిలో చాలా ఆలయాలు ఉన్నట్లు గుర్తించారు. బౌద్ధానికీ పటాన్‌చెరు కేంద్రంగా ఉండేది.