తెలంగాణ

telangana

ETV Bharat / city

శీతాకాలంలోనూ రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలే..

రాష్ట్రంపై వాతావరణ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. హిమాలయ శీతల పవనాలు ముఖం చాటేయడం వల్ల రాత్రిపూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కాలుష్యం, వాతావరణ మార్పులే ప్రధాన కారణమని భారత వాతావరణ విభాగం (ఏఎండీ) వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత పదేళ్ల వ్యవధిలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు సంభవించడం ఇదే తొలిసారి వెల్లడించాయి.

higher temperatures in winter season in telangana
శీతాకాలంలోనూ రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలే..

By

Published : Jan 22, 2020, 7:57 AM IST

శీతాకాలంలోనూ రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలే..

ఈ శీతాకాలంలో వాతావరణ మార్పుల ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. గత పదేళ్లలో తొలిసారి ఈ కాలంలో హిమాలయాల నుంచి పవనాలు రాష్ట్రం వైపు రాలేదు. సాధారణంగా చలికాలం అక్టోబరులో మొదలై ఫిబ్రవరిలో ముగుస్తుంది. నవంబరు నుంచే హిమాలయ గాలులు రాష్ట్రం వైపు రావడం అనవాయితీ. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడినట్లు వాతావరణ శాఖ గుర్తించింది.

రాత్రి పూట సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రపంచ వాతావరణ అధ్యయనాల ప్రకారం.. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగితే పంటల ఉత్పాదకత 10 శాతం వరకు తగ్గుతుందని తేల్చారు. సాధారణంగా అటవీ ప్రాంతాల్లో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత ఉండటం, ఆదిలాబాద్, కుమురంభీం తదితర జిల్లాల్లో తరచూ కనిపిస్తోంది. దీనికి భిన్నంగా అటవీ ప్రాంతంలో ఉన్న భద్రాచలంలో సైతం నాలుగైదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెల 18న భద్రాచలం, నిజామాబాద్‌లో 4.4 డిగ్రీలు అధికంగా నమోదైంది. మంగళవారం తెల్లవారుజామున సైతం తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నిజామాబాద్‌లో 3.9, హైదరాబాద్‌లో 3.6 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదైంది.

ఉపరితల ఆవర్తనమే కారణం

రాష్ట్రానికి ఐదు దిక్కుల నుంచి తేమ, శీతల, వేడిగాలులు వస్తుంటాయి. ఇవి వచ్చే దశను బట్టి రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులుంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తూర్పు, ఆగ్నేయ భారతం నుంచి రాష్ట్రంలోకి తరచూ తేమ గాలులు వీస్తున్నాయి. వీటి వల్ల ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హిమాలయ రాష్ట్రాల్లో ఈ శీతాకాలంలో డిసెంబరు నుంచి విపరీతంగా మంచు కురుస్తున్నా ఇటువైపు శీతల గాలులు రాకపోవడానికి బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలులే కారణమని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

పంట దిగుబడిపై ప్రభావం

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే వరి పైరు సాగు కాల వ్యవధి తగ్గి దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. వరి నాట్లు వేసిన తర్వాత 90 రోజుల నుంచి గింజ పాలు పోసుకునే దశ వస్తుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉన్నా దిగుబడి తగ్గిపోతుంది. ఈ ఏడాది ప్రస్తుత రబీ కాలంలో వరి పంట నాట్లు ఆలస్యంగా వేస్తున్న దృష్ట్యా.. ఈ పైరు ఎదిగే సమయంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగితే ఉత్పత్తి, ఉత్పాదకతలు పడిపోతాయని చెబుతున్నారు.


ఇవీచూడండి: ఏఐ విప్లవానికి తెలంగాణ సిద్ధం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details