ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో కృత్రిమ మేధ ప్రాధాన్యతను తాము గుర్తించామని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే 2020 సంవత్సరాన్ని తెలంగాణలో ఇయర్ ఆఫ్ ఏఐగా ప్రకటించామని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా నిర్వహించిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. రాబోయే ఏఐ విప్లవానికి తాము సర్వసిద్ధంగా ఉన్నామని.. ఏఐ ఎకో సిస్టంను అభివృద్ధి చేసి.. తద్వారా వచ్చే అవకాశాలు అందిపుచ్చుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
2030 నాటికి 40 శాతం ప్రపంచ జీడీపీ.. ఏఐపైనే ఆధారపడి ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే దశాబ్దంలో ఏఐను తమ ప్రాధాన్య అంశంగా కొనసాగి.. టాప్ 25 గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌లో హైదరాబాద్ నిలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఏఐ ఎక్కడెక్కడ..
కృత్రిమ మేధ విప్లవానికి సన్నద్దమవుతూ. ఇప్పటికే తమ ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఏఐను ఏవిధంగా భాగం చేశామో వివరించారు. ట్రాఫిక్ మేనేజ్ మెంట్, పౌరసరఫరాలు, పౌరుల గుర్తింపు, జనగణన, నేర పరిశోధన రంగాల్లో ఏఐ వినియోగాన్ని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో వివరించారు. అనంతరం పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. సింగపూర్ సమాచారశాఖ మంత్రి ఈశ్వరన్, పిరమిల్ గ్రూపు ఛైర్మన్ అజయ్ పిరమిల్, హెచ్పీఐ అధినేత విశాల్ లాల్, ఇతర ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను సమావేశమయ్యారు.
ఇవీచూడండి: తెలంగాణలో అద్భుత వ్యాపార అవకాశాలున్నాయి: కేటీఆర్