తెలంగాణ

telangana

By

Published : Jul 16, 2021, 9:01 PM IST

ETV Bharat / city

Brahmamgari matam: నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి: హైకోర్టు

ఏపీలోని బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ధార్మిక పరిషత్‌ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి: హైకోర్టు
నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి: హైకోర్టు

ఆంధ్రప్రదేశ్​లోని బ్రహ్మంగారి మఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మి పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ధార్మిక పరిషత్‌ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక చర్యలు తీసుకునే అధికారం ధార్మిక పరిషత్‌కు ఉందని.. అధికారం ఉన్నా నిబంధనలకు అనుగుణంగానే చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ధార్మిక పరిషత్‌ తీర్మానానికి అనుగుణంగా గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అసలు విషయం ఏంటంటే..

ప్రత్యేకాధికారికి ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేదని.. నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు నిబంధనలకు అనుగుణంగానే జీవో జారీ చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ధార్మిక పరిషత్‌ ఇచ్చిన తీర్మానం ఆధారంగానే ప్రత్యేకాధికారి ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వివాదం ఏంటంటే..

గత నెల 8న మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం పొందగా.. అప్పటి నుంచి తదుపరి పీఠాధిపతి ఎవరన్న దానిపై వారసుల మధ్య వివాదం నడుస్తోంది. వెంకటేశ్వర స్వామి మొదటి భార్య కుమారులు, రెండో భార్య కుమారులు పీఠాధిపత్యం కోసం పట్టుబట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాల మఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపినా.. సమస్య కొలిక్కి రాలేదు. ఫలితంగా ప్రభుత్వం ఈ వ్యవహారం తేల్చేందుకు దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను నియమించింది. ఆయన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారు.

పీఠాధిపతిగా మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, ఉత్తరాధి పీఠాధిపతిగా రెండో కుమారుడు భద్రయ్య స్వామిని నియమించేలా కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం కుదిరింది. వీరి తదనంతరం.. రెండో భార్య కుమారుడు గోవింద స్వామికి పీఠాధిపతి అవకాశం దక్కనుంది. ఈ మేరకు రాత పూర్వక హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తమను బలవంతంగా ఒప్పించారని దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరారు.

ఇదీ చదవండి:ముగిసిన ఖానామెట్‌ భూముల వేలం.. ఎకరాకు గరిష్ఠంగా రూ.55 కోట్లు

ABOUT THE AUTHOR

...view details