'జైల్లోకి వచ్చాక ఎయిడ్స్ వచ్చిందా? రాకముందేనా?'
రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 27 మంది ఎయిడ్స్ బాధితులు ఉండటంపై ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జైల్లోకి రాకముందు ఎయిడ్స్ బారిన పడ్డారా? వచ్చాక వ్యాధి సోకిందా? అని ఆరా తీసింది.
రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీల్లో ఎయిడ్స్ బాధితులు ఉండటంపై హైకోర్టు స్పందించింది. రాజమండ్రి జైల్లో ఎయిడ్స్ చికిత్సకు రెండు నెలల బెయిల్ కోసం ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. జైల్లోకి వచ్చాక ఎయిడ్స్ సోకిందని తేలితే.. జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. ఆ ఖైదీలను ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందించాలని స్పష్టం చేసింది. వైద్యం అందిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించింది. పోలీస్ శాఖ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎయిడ్స్ బారిన పడిన 27 మంది ఖైదీల్లో 19 మందికి కారాగారంలోకి రాకముందే ఎయిడ్స్ ఉందని తెలిపారు. పూర్తి వివరాలు తెలపాలని కోర్టు ఆదేశించింది. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను కారాగారానికి పంపితే అక్కడి సమస్య తీవ్రత తెలుస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది.
- ఇదీ చూడండి : అదిగో చిరుత, ఇదిగో తోక... అంతా ఉత్తదే..