కేంద్రం చెప్పినట్లుగా ఏపీలో మే 1 నుంచి 18-45 ఏళ్ల వయసు ఉన్న ఎవరికి వ్యాక్సినేషన్ ఇవ్వలేమని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ స్పష్టం చేశారు. 18-45 ఏళ్ల వయసు వారు 2 కోట్ల 4 లక్షల మంది ఉన్నారన్నారు. అవసరమైన డోసుల కోసం ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరిపామన్నారు. టీకా డోసులు అందుబాటులో లేవని చెప్పినట్లు తెలిపారు. మే నెలతో పాటు జూన్‌లోనూ పలు వారాల పాటు చేసే వ్యాక్సిన్ల ఉత్పత్తి.. కేంద్రంతో ఒప్పందం మేరకు సరఫరాకే సరిపోతుందని.. ఆయా సంస్థలు స్పష్టం చేశాయన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా.. ఏపీలో ఏ వేడుకకైనా 50 మందికే అనుమతి మంజూరు చేస్తున్నట్లు సింఘాల్ స్పష్టం చేశారు. క్రీడాప్రాంగణాలు, జిమ్‌లు, ఈతకొలనులు మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రజారవాణా, సినిమాహాళ్లకు 50 శాతం సామర్థ్యంతోనే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు 50 గజాల దూరం పాటించాలన్నారు. ఒకే కాల్‌సెంటర్ ద్వారా ఆస్పత్రుల్లో పడకలు, అడ్మిషన్లు పొందవచ్చన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 11 వేల రెమ్‌డెసివిర్ వయల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.