తెలంగాణ

telangana

By

Published : Sep 10, 2020, 11:46 AM IST

ETV Bharat / city

అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తున్న జీహెచ్​ఎంసీ!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో చెరువులు, పార్కులు, ఖాళీ ప్రభుత్వ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణకు ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ సెల్​కు భారీగా ఫిర్యాదులు వ‌స్తున్నాయి. రెండు నెల‌ల్లోనే 294 ఫిర్యాదులు రాగా... 90 శాతం ఫిర్యాదులలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రాథమిక విచార‌ణను పూర్తి చేసింది. ఇందులో ఇప్ప‌టికే ప‌లు అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేయ‌గా... ప‌లు పార్కుల‌ను స్వాధీనం చేసుకుంది. రాబోయో రోజుల్లో మ‌రిన్ని అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేయ‌నున్నట్టు.. జీహెచ్​ఎంసీ అధికారులు తెలిపారు.

GHMC APC Reacts On Government Assets Aggression
అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తున్న జీహెచ్​ఎంసీ!

గ్రేట‌ర్ హైద‌రాబాద్​లో ప్రభుత్వ ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు జీహెచ్ఎంసీ న‌డుం బిగించింది. అందులో భాగంగానే ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ సెల్​కు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారంటూ.. భారీగా ఫిర్యాదులు వ‌స్తున్నాయి. సెల్ ఏర్పాటైన రెండు నెలల్లోనే ప‌లు పార్కులు, ప్ర‌భుత్వ స్థ‌లాల్లో నిర్మిస్తున్న ఇళ్ల‌ను జీహెచ్​ఎంసీ కూల్చేసింది. ఈ ఏడాది జూన్‌ 6 నుంచి ఏపీసీ (అసెట్స్​ ప్రొటెక్షన్ సెల్) సేవలు మొదలు కాగా సెప్టెంబర్ 6 వ‌ర‌కు 294 ఫిర్యాదులు అందాయి. అందులో దాదాపు 90 శాతం ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ పూర్తయిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ విశ్వజిత్ అన్నారు.‌

జంట న‌గ‌రాల నుంచి మొత్తం రెండు నెల‌ల్లో 294 ఫిర్యాదులు రాగా.. వాటిలో చెరువుల క‌బ్జాపై 68, పార్కుల క‌బ్జాపై 94, ప్ర‌భుత్వ‌ ఖాళీస్థ‌లాల క‌బ్జాపై 132 ఫిర్యాదులు వ‌చ్చాయి. ఇందులో ఇప్పటికే 4 ఇళ్ల‌ను కూల్చివేయగా... 2 పార్కు స్థలాల‌ను జీహెచ్​ఎంసీ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇంకో 16 స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు విశ్వజిత్ తెలిపారు. ప్రాంతాల వారిగా చూస్తే.. ఎల్బీన‌గ‌ర్ జోన్ నుంచి 68 ఫిర్యాదులు రాగా 6 ఫిర్యాదులకు సంబంధించి చర్యలు మొదలయ్యాయి. చార్మినార్ జోన్​లో 32 ఫిర్యాదులు రాగా ఒక‌టి కూల్చివేశారు. మరొక‌టి ప్రాసెస్​లో ఉంది. సికింద్రాబాద్ జోన్​లో 29 ఫిర్యాదులు రాగా ఒక‌టి కూల్చివేశారు. మరో రెండు ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నాయి. ఖైర‌తాబాద్ జోన్​లో 35 ఫిర్యాదులు రాగా ఒక‌ ఫిర్యాదు అధికారుల పరిశీలనలో ఉంది. కూక‌ట్​ప‌ల్లి జోన్​లో 54 ఫిర్యాదులు రాగా ఒక పార్కు స్వాధీనం చేసుకున్నారు. మరో 5 ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నాయి. శేరిలింగంప‌ల్లి జోన్​లో మొత్తం 76 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ఒక పార్కును క‌బ్జా కోర‌ుల చెర నుంచి విడిపించ‌గా మరొక‌ ఫిర్యాదు పరిష్కారం దిశగా సాగుతోంది.

ఏపీసీలో నమోదవుతున్న ఫిర్యాదుల ఆధారంగా జీహెచ్​ఎంసీ క్రమక్రమంగా ఒక్కో పార్కు, ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ఆధీనంలోకి తీసుకుంటోంది. మరో ఐదు ఉద్యానాలు, పలు ఖాళీ స్థలాలను త్వరలో స్వాధీనం చేసుకుంటామని విశ్వ‌జిత్ తెలిపారు. ఇటీవ‌ల‌ చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని గౌతమి నగర్‌ పార్కుస్థలంలో రెండు అక్రమ నిర్మాణాలను, కేపీహెచ్‌బీ ఫేజ్‌-3 పార్కులో నిర్మించిన ఇంటిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కూల్చేశారు. నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో ఉమ్మడి తనిఖీలు పూర్తయ్యాక చెరువుల ఆక్రమణలపై పూర్తిగా దృష్టి సారిస్తామ‌న్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణల గురించి 1800-5990-099 టోల్‌ ఫ్రీ నంబరుకు సంప్రదించి ఫిర్యాదులు ఇవ్వొచ్చు‌. సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీక‌రిస్తారు. ఫిర్యాదుదారుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. గ్రేట‌ర్ వ్యాప్తంగా ఎక్కడ ప్ర‌భుత్వ ఆస్తులు ఆక్ర‌మ‌ణ‌కు గురైనా వెంట‌నే స‌మాచారం అందించాల‌ని విశ్వ‌జిత్ కోరారు.

ఇదీ చూడండి :ఉత్తమ్ సాక్షిగా కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details