పేదల బతుకుల్లో వెలుగులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు చట్టం తెచ్చినట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఏడాది పాలన పూర్తవుతోన్న సందర్భంగా విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేధోమథన సదస్సు నిర్వహించారు. పేద పిల్లల కోసం ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే దానిని అడ్డుకునేందుకు కొందరు కుట్ర పన్నారని సీఎం అన్నారు. ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తే తెలుగును అవమానించినట్లా అని ప్రశ్నించారు.
ఇటీవల 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోగా... 96 శాతం మంది ఆంగ్ల మాధ్యమానికే మద్దతు తెలిపారని జగన్ వెల్లడించారు. వీటన్నింటినీ ఎస్సీఈఆర్టీకి పంపగా... ప్రతి మండల కేంద్రంలో ఒక తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేసి మిగిలినవి ఆంగ్లమాధ్యమం అమలుకు సిఫార్సు చేసిందన్నారు. ఈ ఏడాది 1-6 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరిగా ప్రవేశపెడతామన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి .. దీని కోసం సుప్రీం కోర్టుకు వెళ్తామని ప్రకటించారు.