ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ (కొవిడ్-19) సోకినట్లు నిర్ధరణ అయినట్టు కలెక్టర్ ధ్రువీకరించారు. కరోనా అనుమానంతో ఓ యువకుడు జీజీహెచ్‌లో నిన్న చేరిన విషయం తెలిసిందే. అతను ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడు. అతని నమూనాలను మొదట తిరుపతి స్విమ్స్‌లో పరీక్షించి కరోనా సోకినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం పూర్తిస్థాయి పరీక్షల కోసం నమూనాలను పుణె పంపగా అక్కడ పాజిటివ్‌గా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బాధితుడిని నెల్లూరు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా బాధితుడి కుటుంబ సభ్యుల నమూనాలను పరీక్షించగా నెగటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.
మరో మహిళకు.. చికిత్స
మరోవైపు.. కరోనా వైరస్ అనుమానంతో మరో మహిళ నెల్లూరు జీజీహెచ్‌లో చేరింది. ఆమెకు ఐసోలేషన్ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సదరు మహిళ ఇటీవల కువైట్ వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఆమె నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పుణె పంపించినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే చేరిన 65 ఏళ్ల వృద్ధురాలికి వ్యాధి లేదని వైద్యులు నిర్ధరించారు.