తెలంగాణ

telangana

రైతులకు పంట బీమా పథకంలో తీవ్ర జాప్యం..

By

Published : Oct 8, 2022, 11:53 AM IST

Farmers crop insurance and compensation: రాష్ట్రంలో కొత్త పంట బీమా పథకం ప్రవేశపెట్టడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రధాన మంత్రి పంట బీమా పథకం రెండేళ్ల క్రితం ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆ స్థానంలో కొత్తది ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ... కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా ప్రకృతి వైపరిత్యాల బారినపడి దెబ్బతిన్న పంటలకు బీమా పరిహారం లేక రైతులు తీవ్రంగా నష్టాలు చవిచూస్తున్నారు.

farmars loss
రైతుల నష్టాలు

బీమా ధీమా ఎన్నడు

Farmers crop insurance and compensation: రాష్ట్రంలో వ్యవసాయ పంటల బీమా పథకంపై సర్వత్రా విస్తృత చర్చ నడుస్తోంది. సీజన్ ఆరంభంలో... ఆ తర్వాత దాదాపు నెల రోజులు పైగా తీవ్ర వర్షాల ప్రభావంతో వ్యవసాయ పంటలు నీట మునిగాయి. ప్రధాన వాణిజ్య పంట పత్తి తీవ్రంగా దెబ్బతింది. మొత్తంగా అన్ని రకాల పైర్లు దాదాపు 10 లక్షల ఎకరాలు పైగా నష్టం జరిగిందని స్థానికంగా అంచనా వేశారు. అయితే పంటల బీమా లేక, పరిహారం అందక రైతులు తీవ్రంగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.

రైతు సంఘాలు.. మొదట్లో నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. దీనికి తోడూ ఎలాంటి పంటల బీమా అమల్లోలేక రైతులు నష్టాల్ని భరించాల్సి వచ్చింది. పీఎంఎఫ్‌బీవై పథకం రద్దు, కొత్త బీమా పథకం తీసుకురాకపోవడం వల్లే రైతులు బీమా సదుపాయం నోచుకోక పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రైతు సంఘాలు ఆక్షేపించాయి.

పీఎంఎఫ్‌బీవై వల్ల పెద్దగా ప్రయోజనం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రైవేటు బీమా సంస్థలు రైతులకు సక్రమంగా పరిహారం అందజేయడం లేదన్న వాదనలు వచ్చాయి. రైతుబంధు పథకం అమలు చేస్తున్న దృష్ట్యా మళ్లీ పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లించాల్సి రావడం భారమని కూడా ప్రభుత్వం ఓ నిర్ణయాకొచ్చింది. ఇలా అనేక కారణాలతో ఈ పథకం నుంచి సర్కారు వైదొలిగింది.

ఏపీలో ఒక్క రూపాయికే పంట బీమా.. అలాగని సొంత బీమా పథకాన్నైనా ప్రారంభించ లేదు. ఫలితంగా రెండేళ్లుగా రైతులకు పంట నష్టం జరిగినా పరిహారం దక్కలేదు. బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఈ పథకం స్థానంలో తమ సొంత పథకాలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌లో రూపాయి ప్రీమియంతోనే ఉచితంగా పంట బీమా పథకం అమలు చేస్తోంది. ఈ రాష్ట్రాల మాదిరిగా పంట బీమా పథకం ప్రవేశపెట్టడం ద్వారా ప్రకృతి విపత్తుల బారినపడి వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు విధిగా పరిహారం చెల్లించి ఆదుకోవాలని కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేశారు.

వ్యవసాయ ఆర్థిక వేత్తల సూచన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ వాటాలు చెల్లించేలా పంటల బీమా పథకం ఎప్పట్నుంచో అమలవుతోంది. అయితే... 2016-17లో ఈ పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రూపుదిద్దుకుంది. ప్రీమియం సొమ్ములో రైతులు వానా కాలం పంటలకు గరిష్టంగా 2 శాతం, యాసంగిలో 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం కట్టాలి. 2020 వానా కాలం నుంచి ఈ పథకం అమలు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందం చేసింది.

తీరా పీఎం పంట బీమా పథకం అమలు లోపభూయిష్టంగా మారడంతో పలు రాష్ట్రాలు ఉపసంహరించుకున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని కొత్త బీమా పథకం ప్రవేశపెట్టి గ్రామం యూనిట్‌గా తీసుకుని ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు రైతుబంధు వర్తించే ప్రతి రైతుకు పరిహారం చెల్లించే వ్యవస్థ అమల్లోకి తీసుకొస్తే రైతులోకం సంతోషంగా ఉంటుందని వ్యవసాయ ఆర్థికవేత్తలు సూచించారు.

రాష్ట్రంలో పంటల బీమా లేకపోవడంతో... పలువురు రైతులు ప్రైవేటు బీమా కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా ప్రీమియం వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలను నియంత్రణలో వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం విమర్శలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details