విద్యుత్ సవరణ బిల్లు 2021ని ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ సూచన ప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం అన్ని సన్నాహక చర్యలను పూర్తి చేసింది. కేబినెట్ ఆమోదం కోసం బిల్లును అన్ని మంత్రిత్వశాఖలకు పంపారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదిత బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. డిస్కంలలో ఫ్రాంచైజీ విధానాన్ని వ్యతిరేకించింది. ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా ఇంత పునరుత్పాదక ఇంధనం తయారు చేయాలని లేకపోతే జరిమానా చెల్లించాలన్న నిబంధననూ తప్పుపట్టింది. దేశవ్యాప్తంగా మరికొన్ని రాష్ట్రాలూ విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.
బిల్లులోని ప్రధాన అంశాలు
- కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టటానికి చేస్తున్న ప్రయత్నాలను పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ వ్యతిరేకించింది. దీనికి నిరసనగా ఆగస్టు 10న దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది.
- విద్యుత్ పంపిణీలో ప్రయివేటు వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించే లైసెన్సింగ్ విధానంలో మార్పులు తేవాలని ఉద్దేశించారు. ప్రస్తుతం ఉన్న పంపిణీ సంస్థలు యథావిధిగా కొనసాగవచ్చని ప్రతిపాదించారు. దీని వల్ల ఒకే ప్రాంతంలో అనేక సంస్థలు రంగంలోకి వస్తాయి.
- పునరుత్పాదక ఇంధనం కొనుగోలు బాధ్యత (ఆర్‌పీఓ)లను తప్పనిసరిగా నెరవేర్చాలని సూచించారు. ఇందులో విఫలమైతే అపరాధ రుసుం విధించాలని సూచించారు.
- విద్యుత్ పంపిణీకి అర్హతగల సంస్థలు ముందుగా సంబంధిత రెగ్యులారిటీ కమిషన్ దగ్గర రిజిస్టర్ కావాలి.
- సుప్రీంకోర్టు తీర్పు మేరకు, విద్యుత్ నియంత్రణ మండలిలో తప్పనిసరిగా లా చదివిన అనుభవం ఉన్న వ్యక్తిని సభ్యునిగా చేర్చుకోవాలని ప్రతిపాదించారు.
- అప్టెల్ (అప్పిలేట్ ట్రైబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ)ని పటిష్ఠం చేయాలి.
- ప్రాంతీయంగా ఉన్న గ్రిడ్‌లన్నింటినీ ఒక గొడుగు కిందకు తేవాలి.
- విద్యుత్ వినియోగదారుల హక్కులు, బాధ్యతల స్పష్టీకరణ.
- గ్రీన్‌టారిఫ్‌ను ప్రవేశపెట్టే యోచన.
- ఈ బిల్లు ఆమోదం పొందితే, డిస్కంల ప్రయివేటీకరణ, వ్యవసాయ ఫీడర్ల విభజన వంటి చర్యలు వేగవంతమవుతాయి. ఇందులో భాగంగా అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్‌మీటర్లు బిగిస్తారు. విద్యుత్ వినియోగం అంచనా వేయటానికి వ్యవసాయ వినియోగదారులు మినహా మిగిలిన వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేస్తారు.
ఇదీచూడండి:పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టే బిల్లులివే..