Eating more meat cause heart diseases: గుండె రక్తనాళాల్లో పూడికల ముప్పు తగ్గాలంటే మాంసం ఎక్కువగా తినొద్దని డాక్టర్లు చెబుతుండటం తెలిసిందే. ఇంతకీ మాంసంతో పూడికల ముప్పు ఎలా పెరుగుతుంది? పేగుల్లోని సూక్ష్మక్రిముల ద్వారా! ఆశ్చర్యంగా అనిపించినా కొంతవరకు ఇది నిజమేనని టఫ్ట్స్ యూనివర్సిటీ, క్లీవ్‌లాండ్ క్లినిక్ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది. మాంసంలో ఎల్-కార్నిటైన్ రసాయనం, కోలిన్ పోషకం దండిగా ఉంటాయి. వీటిని పేగుల్లోని సూక్ష్మక్రిములు జీర్ణం చేసుకుంటాయి.
ఈ క్రమంలోనే ట్రైమిథైలమైన్-ఎన్-ఆక్సైడ్ (టీఎంఏఓ), అలాగే దీనికి సంబంధించిన వై-బుటీరోబెటైన్, క్రోటోనోబెటైయిన్ వంటి రసాయనాలు (మెటబాలైట్లు) పుట్టుకొస్తాయి. ఇవి పూడికలు ఏర్పడటంలో పాలు పంచుకుంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. ‘‘ఎల్-కార్నిటైన్, కోలిన్ నుంచి పుట్టుకొచ్చిన మెటబాలైట్లు గ్రంథుల మాదిరిగానే పనిచేస్తాయి. హార్మోన్ల మాదిరిగా రక్తం ద్వారా శరీరమంతటా ప్రయాణిస్తూ ప్రభావం చూపుతాయి’’ అని సహ అధ్యయన కర్త డాక్టర్ టాంగ్ చెబుతున్నారు.