ఓ పేదింటి యువకుడి దీనస్థితిని ఆసరాగా తీసుకొని అగంతకుడు మోసానికి పాల్పడ్డాడు. కరోనా సమయంలో వేలాదిమందికి సాయం చేసిన హీరో సోనూసూద్ పేరిట మోసం చేశాడు. ఈ సంఘటన సంతబొమ్మాళిలో సోమవారం చోటుచేసుకుంది. సంతబొమ్మాళి వెలమవీధికి చెందిన కొయ్యాన రాంబాబు కుటుంబ పరిస్థితి సరిగా లేకపోవడంతో కూలిపనులు చేసుకుంటూ చదువుకుంటున్నాడు. అతని మిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో సాయం చేయాలని అర్థిస్తున్నారు. దీన్ని అదునుగా తీసుకున్న ఓ అగంతకుడు బాధితుడికి సాయం చేస్తానని చెప్పి మోసానికి పాల్పడ్డాడు.
సోనూసూద్‌ను మాట్లాడుతున్నానంటూ రాంబాబుకు సోమవారం ఫోన్ చేశారు. బ్యాంకు ఖాతాలో రూ.3 లక్షలు ట్రస్టు ద్వారా వేస్తామని చెప్పి, ముందుగా రూ.12 వేలు నగదు జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని ఫోన్‌లో చెప్పారు. రిజిస్ట్రేషన్ ఖర్చుల కింద ముందుగా రూ.2 వేలు ఫోన్‌పే చేయాలనడంతో అతని మాటలు నమ్మిన రాంబాబు తన మిత్రుడు సాయంతో ఆ నగదు పంపించారు. గంట తర్వాత ఆ నెంబర్‌కు కాల్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుకున్న బాధితుడు సంతబొమ్మాళి ఎస్.ఐ.గోవింద్ దృష్టికి ఇదే విషయాన్ని తెలిపారు.