Covid Effect on Passports : రాష్ట్రంలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. కొద్దిరోజులు విరామం ఇచ్చి మళ్లీ విజృంభించడం ప్రారంభించింది. గత రెండేళ్ల నుంచి కరోనా, లాక్డౌన్ వల్ల అన్ని రంగాలు కుదేలై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో మూడో ముప్పు మరోసారి ముంచుకొచ్చింది. కరోనా ప్రభావం విదేశీ ప్రయాణాలపై కూడా పడింది. రాష్ట్రంలో పాస్‌పోర్టుల జారీపైనా కరోనా తన ప్రభావాన్ని చూపింది. 2019లో ఐదున్నర లక్షల మంది పాస్‌పోర్టు సేవలు వినియోగించుకోగా.. 2020లో 3 లక్షల కంటే తక్కువ.. 2021లో 4.42 లక్షల మందికి పాస్‌పోర్టులు జారీ అయ్యాయి.
పాస్‌పోర్టులపై కరోనా ప్రభావం..
Covid Effect on Passports in Telangana : సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి 2019 సంవత్సరంలో అత్యధికంగా 5.54లక్షల మంది పాస్‌పోర్టు సేవలు అందుకున్నట్లు ఆర్పీవో దాసరి బాలయ్య తెలిపారు. కరోనా తీవ్ర రూపం దాల్చిన 2020లో లాక్‌డౌన్‌లోనూ అత్యవసర పాస్‌పోర్టు సేవలు కొనసాగించినట్లు వెల్లడించారు. కానీ కొవిడ్ భయంతో చాలా వరకు విదేశీ ప్రయాణాలు తగ్గాయన్న బాలయ్య.. దాని ప్రభావం పాస్పోర్టులపైన పడిందని అన్నారు. 2020లో 3 లక్షల కంటే తక్కువ మంది పాస్‌పోర్టులు తీసుకున్నట్లు చెప్పారు.
2021లో పెరిగాయి..
Corona Effect on Passports : లాక్డౌన్ తర్వాత.. 2021 జూన్ నెలలో 50% అపాయింట్‌మెంట్లతో తిరిగి పాస్‌పోర్ట్ జారీ సేవలు మొదలు పెట్టారు. ఆగస్టు నుంచి 75శాతం పాస్‌పోర్టు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రమంగా పాస్‌పోర్టులకు డిమాండ్ పెరగడం వల్ల సెప్టెంబరు 23వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో పాస్‌పోర్టు సేవలు మొదలయ్యాయి. వీక్లీ ఆఫ్ రోజు కూడా పని చేయడం, అపాయింట్మెంట్ల సంఖ్యను పెంచడం ద్వారా గతేడాది అక్టోబరు, నవంబరు నెలల్లో పాస్‌పోర్టుల జారీలో ఆలస్యాన్ని తగ్గించగలిగినట్లు బాలయ్య తెలిపారు. కొవిడ్ ప్రభావంతో అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2020లో సగానికి సగం తగ్గిపోయి కేవలం 2.93 లక్షల పాస్‌పోర్టులు మాత్రమే జారీ అయ్యాయి. కరోనా నుంచి కాస్త కోలుకోవడంతో 2021లో 4.42 లక్షల పాస్‌పోర్టులు జారీ అయ్యాయి.