ఏపీలోని విశాఖపట్నం జిల్లా గాజువాకలో ప్రేమోన్మాది ఉన్మాదానికి బలైన యువతి ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని అధికారులను ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఘటనపై సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం.... యువతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
గాజువాక ఘటనపై ఏపీ సీఎం జగన్ ఆరా... రూ.10 లక్షలు సాయం - young woman killed in Visakhapatnam
ఏపీలోని విశాఖలో ప్రేమోన్మాదానికి బలైన యువతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్ సూచించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
యువతి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికాశుక్లా, దీపికా పాటిల్‌కు సూచించారు. ప్రతి టీనేజ్ బాలిక మొదలు... ప్రతి మహిళ వరకు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రత్యేకించి పాఠశాలల్లో చదువుతున్న బాలికలు నుంచి కళాశాల విద్యార్థినుల వరకు వందకు వంద శాతం ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని బాలిక లేదా మహిళ ఏదైనా సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించవద్దని, ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.