Chandrababu participated in Unstoppable show: పేదలకు మంచి చేయాలన్న ఎన్టీఆర్ ఆశయాన్ని, ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకే.. బాధాకరమైనా 1995లో పెద్ద నిర్ణయం (ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగింపు) తీసుకోవాల్సి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పరిణామాలకు ముందు ఆయనతో మూడు గంటల పాటు సమావేశమై బతిమాలి, కాళ్లు పట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చడం దురదృష్టకరమని, తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆయన పేరు పెడతామని స్పష్టం చేశారు. ఆహా ఓటీటీ వేదికగా ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’కు చంద్రబాబు, లోకేశ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. ‘త్వరగా ఏవీ దొరకవు. దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించాలంటే ప్రణాళిక, దూరదృష్టి ముఖ్యం. ఈ రోజు చేయాల్సిన పని చేస్తూనే.. పది, ఇరవై ఏళ్ల తర్వాత సమాజ హితం కోసం ఏం చేయాలనే ప్రణాళికలు రూపొందించాలి. ఎన్టీఆర్‌తో పాటు మాజీ ప్రధానమంత్రులు వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, ప్రస్తుత ప్రధాని మోదీ, నేను ఇలానే ఆలోచిస్తాం’ అని చెప్పారు.
1995లో చేసింది తప్పా?..‘1995లో కుటుంబంలోనూ సమస్యలు వచ్చాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమస్యలు వివరించాలని ఎన్టీఆర్‌ను కలిశా. అప్పుడక్కడ అయిదుగురమే (ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ, బీవీ మోహన్‌రెడ్డి, చంద్రబాబు) ఉన్నాము. ఎందుకొచ్చారని ఎన్టీఆర్ అడిగారు. కుటుంబమైతే మీరు ముగ్గురు (బాలకృష్ణ, హరికృష్ణ, చంద్రబాబు) మాట్లాడొచ్చు, రాజకీయమైతే నన్నొక్కడినే మాట్లాడాలన్నారు. తర్వాత నేను మూడు గంటల పాటు ఎన్టీఆర్‌తో మాట్లాడాను. బతిమాలాను, చిక్కులు చెప్పాను. కాళ్లు పట్టుకుని కూడా అడుక్కున్నా. నా మాట వినండి. ఎమ్మెల్యేలకు ఒక్క మాట చెప్పి ఓదార్చితే ఏమీ జరగదని చెప్పా.. అయినా తిరస్కరించారు’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
‘రామాంజనేయ యుద్ధమే తీసుకుంటే.. రామబాట ముఖ్యమని ఆంజనేయుడు యుద్ధానికి సిద్ధమయ్యారు. అది చరిత్ర. ఆ రోజు మనమూ అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌తో కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నా.. ఆయన సిద్ధాంతాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ముందడుగేశాము. దానికి మీరే (బాలకృష్ణ) సాక్ష్యం. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా?’ అని ప్రశ్నించారు. ‘తమిళనాడులో ద్రవిడ సంస్కృతి, సంస్కరణలకు కారణమైన నేత రామస్వామి నాయకర్, కరుణానిధి, ఎంజీఆర్ తదితర నేతలు ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారు. నాయకర్ కూడా 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆయనతో అందరూ విభేదించారు. ఇప్పుడు అన్ని పార్టీలూ ఆయన భావజాలంలోనే నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్టీఆర్ భావజాలం గొప్పది. ఆ బాటలోనే అందరూ నడుస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
రాజకీయాల్లో నా స్నేహితుడు రాజశేఖరరెడ్డి..రాజకీయాల్లో తనకు మంచి మిత్రుడు రాజశేఖరరెడ్డి అని చంద్రబాబు చెప్పారు. ‘ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి ఎంతోమంది స్నేహితులున్నా.. వారు ఒక దశలో ఆగిపోయారు. విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు కొందరు స్నేహితులు ఏర్పడ్డారు. రాజకీయాల్లోకి వచ్చాక నేను, రాజశేఖరరెడ్డి కలిసి 1978 నుంచి 1983 మధ్య అయిదేళ్లు బాగా తిరిగాము. 1983లో నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక ఇద్దరం బద్ధశత్రువులుగా మారాము. అది రాజకీయ విభేదమే. వ్యక్తిగతంగా ఎప్పుడూ లేదు’ అని వివరించారు.