భారత్‌లో... మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, అభిరుచులు, పని ఒత్తిళ్ల కారణంగా సగటున 22 నుంచి 35 ఏళ్ల వయసు గలవారిలో 17 శాతం గురక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ నిద్ర దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లోని స్టార్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాధారణంగా రాత్రి వేళల్లో నిద్ర లేమి, గురక, శ్వాస పీల్చుకోవడంలో ఉత్పన్నమయ్యే ఇబ్బందుల వల్లనే 91 శాతం గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.
38 రకాల ప్రాణాంతక వ్యాధులు
21వ శతాబ్దం రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 'నిద్ర లేమి' వల్ల నాలుగు దశల్లో... అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండెపోటు వంటి 38 రకాల ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని వైద్య నిపుణులు వివరించారు. ఈ శతాబ్దంలో అధిక శాతం మానవాళి నష్టపోతున్న రుగ్మత ఇది. ఒక దశ దాటిపోయిన తర్వాత దీనిపై ఏ ఔషధాలు పనిచేయవని చెప్పారు.