Nitin Gadkari on ORR: ఏపీ రాజధాని అమరావతిని, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహా నగరంగా అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వాటితో పాటు, చుట్టుపక్కల ఉన్న మరిన్ని ప్రాంతాల్నీ ఒక బృహత్ అభివృద్ధి నడవాగా చేసేందుకు 189 కి.మీ.ల పొడవైన ఓఆర్‌ఆర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కలసి ప్రణాళికలు సిద్ధం చేశాయి. నిర్మాణవ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. సవివర ప్రాజెక్టు నివేదికా సిద్ధమైంది. అవసరమైన భూములను సమీకరించి, నిర్మాణం మొదలు పెట్టడమే తరువాయి... రాజధాని అమరావతి నిర్మాణ పనులతో పాటు, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టునూ అటకెక్కించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టే వద్దని కేంద్రానికి చెప్పేసింది. ఆ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్‌కి బదులుగా.. 78 కి.మీ.ల విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు పేర్కొన్నారు.
అభివృద్ధికి రాచబాట
అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ముఖచిత్రమే మారిపోతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకే కాదు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికీ ఈ రింగురోడ్డు దోహదం చేస్తుంది. రింగురోడ్డుకు లోపలున్న ప్రాంతంతో పాటు, వెలుపల చుట్టూ కొన్ని కి.మీ.ల దూరం అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఓఆర్‌ఆర్‌కి వెలుపల, సమీపంలో ఉన్న చిన్న పట్టణాలు, ముఖ్యమైన పట్టణ కేంద్రాలకు ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం పెరిగి ప్రత్యేక ‘డెవలప్‌మెంట్ నోడ్స్’గా మారతాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల్ని కలుపుతూ ఓఆర్‌ఆర్ నిర్మించడం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానత పెరుగుతుంది.
రాజధాని వద్దన్నారు సరే... రింగురోడ్డూ వద్దా?
ఏపీకి అమరావతిని ఏకైక రాజధానిగా చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదనుకున్నా... ఈ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాల్సిందే కదా. మరోపక్క అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తామనీ సర్కారు అంటోంది. అమరావతిని నగరపాలక సంస్థగా చేసే ఆలోచనా ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారికి అటూఇటూ ఇప్పటికే భారీ నివాస, వాణిజ్య సముదాయాలు వచ్చాయి. ఈ రెండు ప్రాంతాలూ త్వరలోనే కలసిపోయే అవకాశమూ ఉంది. అలాంటప్పుడు... ఈ ప్రాంత అభివృద్ధికి ఓఆర్‌ఆర్ అవసరమే కదా? ప్రభుత్వం దాన్నెందుకు కాదంటోంది? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పొరుగు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోరా?
ప్రపంచంలోని పలు మహా నగరాలు వేగంగా అభివృద్ధి చెందడంలో, విస్తరించడంలో అవుటర్ రింగ్ రోడ్ల పాత్ర కీలకం. తాజా ఉదాహరణ హైదరాబాద్ చుట్టూ నిర్మించిన రింగురోడ్డే. 425 ఏళ్లలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తయితే... ఓఆర్‌ఆర్ నిర్మించాక గత పది పన్నెండేళ్లలో సాగిన అభివృద్ధి ఒక ఎత్తు. ఓఆర్‌ఆర్‌తో ఒకప్పటి హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. ఆ ప్రాంత బహుముఖాభివృద్ధికి రింగురోడ్డు ద్వారాలు తెరిచింది. ఓఆర్‌ఆర్ నిర్మించే సమయానికి ప్రధాన నగరానికి, ఓఆర్‌ఆర్‌కి మధ్యలో చాలా ఖాళీ ప్రదేశం ఉండేది. ఆ ప్రాంతమంతా ఇప్పుడు జనావాసాలతో నిండిపోయింది. నివాస, ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు శరవేగంగా ఊపందుకున్నాయి. ప్రభుత్వం గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఐటీ ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పార్కులు, హరిత టౌన్‌షిప్‌లు, అంతర్జాతీయ విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వినోద, గేమింగ్ జోన్లు వచ్చాయి. గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట, కొంపల్లి, హయత్‌నగర్, రాజేంద్రనగర్, ఈసీఐల్, షాద్‌నగర్, కాప్రా తదితర చోట్ల పెద్ద సంఖ్యలో నిర్మాణాలు సాగుతున్నాయి.
మరో బృహత్ ప్రాజెక్టు ఆర్‌ఆర్‌ఆర్
ఓఆర్‌ఆర్ లోపలా జనాభా సాంద్రత పెరగడంతో... అభివృద్ధిని మరింత విస్తరింపజేసేందుకు ఇప్పుడు ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్రం తాత్కాలికంగా ఎన్‌హెచ్166ఏఏ నంబరునూ కేటాయించింది. ఓఆర్‌ఆర్‌కి 40 కిమీ వెలుపల... దీన్ని నిర్మించనున్నారు. పొడవు 340 కిలోమీటర్లు. ఇది పూర్తయితే తెలంగాణలోని 40-50 శాతం ప్రజలు... ఈ రోడ్డు లోపలే ఉంటారని అంచనా.