తెలంగాణ

telangana

ETV Bharat / city

రూ.10వేల కోట్లు తగ్గిన ఏపీ ఆదాయం

ఆంధ్రప్రదేశ్​ ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో పయనిస్తోంది. మునుపటి సంవత్సరం కంటే ఆదాయం.. దాంతోపాటే ఖర్చు పెంచుకోవాల్సి ఉండగా, అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయం, చేసే ఖర్చు విషయంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వెనకబాటు స్పష్టంగా కనిపిస్తోంది.

ap-economic-sources-decreased
రూ.10వేల కోట్లు తగ్గిన రాష్ట్ర ఆదాయం

By

Published : Jan 5, 2020, 7:57 AM IST


ఆంధ్రప్రదేశ్​ ఆర్థికపరిస్థితి తిరోగమనంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం, ఖర్చు భిన్నమైన స్థితిలో ఉన్నాయి. ఆర్థిక గణాంకాల ప్రకారం చూస్తే ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పింఛన్లు, గత ప్రభుత్వం తెచ్చిన అప్పులపై వడ్డీ, అసలు చెల్లింపులు, ప్రభుత్వ నిర్వహణ వ్యయాలు, వీటికితోడు కొంత సంక్షేమ కార్యక్రమాలకే ప్రభుత్వ ఖర్చులు పరిమితమవుతున్నాయి. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు, ఇతరత్రా ఆదాయాలు సముపార్జించే, దీర్ఘకాలంలో ప్రయోజనం కల్పించే మూలధన వ్యయం నామమాత్రమైపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టులోనూ సరైన పనులు చేపట్టింది లేదు. ఇతర నిర్మాణాలూ ఆగిపోయాయి. నిజానికి ఏటికేడు బడ్జెట్‌ అంచనాలు పెరుగుతాయి. రాబడితో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికవ్యవస్థ వెనకబడిందని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.

నామమాత్రమైన మూలధన వ్యయం

ఆదాయమెక్కడ..?

పన్నులు, గ్రాంట్లు, అప్పులు.. ఇలా అన్నిరకాలుగా ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరు నెలాఖరు వరకు వచ్చిన ప్రభుత్వాదాయం రూ.98,790 కోట్లు మాత్రమే. అదే సమయానికి గతేడాది (2018-19) ఆ ఆదాయం రూ.1,08,700.45 కోట్లు. ఆదాయాన్ని బట్టే ప్రభుత్వఖర్చు ఉంటుంది. ఆదాయం తగ్గడంతో ఖర్చు కూడా ఈ ఏడాది తగ్గింది. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం మరీ తక్కువ. కేంద్రపన్నుల్లో రాష్ట్రవాటా కూడా తగ్గింది. ఆర్థిక కార్యకలాపాలు, అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ రూపంలో రూ.4,220 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూ.2,100, ఎక్సైజ్‌ ఆదాయం రూ.1,200 కోట్ల వరకు తగ్గాయి. మొత్తమ్మీద దాదాపు రూ.10,000 కోట్ల ఆదాయం తగ్గిపోయింది.

మూలధన వ్యయం ఏదీ?

వచ్చిన ఆదాయంలో సింహభాగం ప్రభుత్వోద్యోగుల జీతాలు, పింఛన్ల రూపంలోనే వెచ్చించాల్సి వచ్చింది. ఈ ఎనిమిది నెలల్లో రూ.34,890 కోట్లు ఇందుకే ఖర్చుచేశారు. వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు పోను మిగిలిన ఖర్చులో ఎక్కువ భాగం రెవెన్యూ వ్యయమే. అందులోనూ ప్రభుత్వ నిర్వహణకు, సంక్షేమ పథకాలకే ఆ మొత్తం ఖర్చుచేశారు. మొత్తం రెవెన్యూ వ్యయం రూ.88,891 కోట్లు. ఇందులో సాంఘిక విభాగం కింద (సంక్షేమ కార్యక్రమాలు ఇందులోకే వస్తాయి) రూ.45వేల కోట్ల వరకు ఖర్చు చేశారు. అదే సమయంలో గత సంవత్సరం ఈ ఖర్చు రూ.47 వేల కోట్ల వరకు ఉంది. మూలధన వ్యయాన్నే అభివృద్ధికి కొలమానంగా చూపిస్తారు. ఈ ఎనిమిది నెలల్లో దానిపై కేవలం రూ.4737 కోట్లే ఖర్చు చేశారు. అదే సమయంలో గత ఆర్థిక సంవత్సరంలో రూ.15,223 కోట్లు ఖర్చుచేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మూలధన వ్యయం అంటే ముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రభుత్వానికి తర్వాతి కాలంలో ఆదాయం ఇచ్చే వనరులు సృష్టించేవిగా భావిస్తారు. సాధారణంగా బడ్జెట్‌ అంచనాల్లోనే మూలధన వ్యయం తగ్గిపోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతుంటాయి. అలాంటిది అంచనాల మేరకు కూడా మూలధన వ్యయం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

సంక్షేమ పథకాలకే మెుత్తం ఖర్చు చేశారు

అంచనాలను మించిన రెవెన్యూ లోటు

ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.1,778.52 కోట్లకే పరిమితమవుతుందని బడ్జెట్‌ అంచనాలు పేర్కొన్నాయి. ఎనిమిది నెలల కాలానికి చూస్తే ఇప్పటికే రెవెన్యూ లోటు ఏకంగా రూ.25,141.30 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు కూడా ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎంతగా లెక్కించారో మొదటి ఎనిమిది నెలలోనే దాదాపు ఆ స్థాయికి చేరింది.

ఇదీ చదవండి : రాజధాని నివేదికలు అసత్యాల పుట్ట : చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details