ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్(AP CM JAGAN) అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం(AP CABINET MEET) ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. రహదారులు భవనాల శాఖకు చెందిన ఆస్తుల బదలాయింపు సహా కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రహదారులు భవనాల శాఖకు చెందిన రూ. 4 వేల కోట్ల ఆస్తులను.. రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు బదలాయించే ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీలో కొత్తగా లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. కేంద్రం సహకారంతో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక కారిడార్‌లకు, పోర్టులకు అనుసంధానంగా ఈ లాజిస్టిక్ పార్కులను ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
ఏపీలో నిధుల సమీకరణకు సంబంధించి మరో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనలను ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఏపీలో నూతన సీడ్ పాలసీ అమలుపై చర్చించే అవకాశం ఉంది. జాతీయ విద్యా విధానంను ఏపీలో ఏవిధంగా అమలు చేయాలనే అంశంపై ఏపీ మంత్రివర్గం సమీక్షించనుంది. నేతన్న నేస్తం, పాఠశాలల్లో నాడు- నేడు రెండో దశ పనులకు ఆమోదం తెలపనున్నారు.