AC for Kids : ఎండలకు మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇక పసివాళ్ల సంగతేంటి? ‘అందుకేగా ఏసీ ఏర్పాటు చేశాం’ అంటారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కొత్త సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
- పిల్లలు గదిలో ఉన్నప్పుడు ఏసీ వేయొద్దు. ముందుగానే వేసి, వాతావరణం చల్లబడ్డాకే పిల్లల్ని గదిలోకి తీసుకెళ్లాలి. ఉష్ణోగ్రత 27 డిగ్రీలకంటే తగ్గకుండా చూసుకోవాలి. చల్లదనం నేరుగా వారి ముఖానికి తగలకుండా చూసుకోవాలి.
- ఏకధాటిగా వేసి ఉంచాల్సిన పనిలేదు. గది చల్లబడింది అనిపించాక ఆపేయొచ్చు. తలుపులు తరచూ తెరవకుండా ఉంటే చాలు.
- ఏసీ గాలికి పిల్లల లేత చర్మం పొడిబారుతుంది. కాబట్టి, ఎక్కువగా మాయిశ్చరైజర్ రాయండి. చేతులు, కాళ్లు కప్పే దుస్తుల్ని వేయాలి. ఇవి చలి నుంచి వారిని కాపాడతాయి. టోపీని కూడా పెట్టండి. దుప్పటి కప్పుతుంటే మోచేతుల కిందకే ఉండేలా చూసుకోండి.
- నిర్ణీత కాలవ్యవధుల్లో తప్పకుండా సర్వీసింగ్ చేయించండి. దీనిలోనూ దుమ్ము చేరుతుంటుంది. ఈ సూక్ష్మకణాలు వాళ్లలో ఆస్తమా, అలర్జీలకు కారణమవుతాయి. అందుకే సర్వీసింగ్ తప్పని సరి.
- ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి పిల్లల్ని తీసుకెళ్లడం మామూలే. కానీ ఒక్కసారిగా చల్లటి వాతావరణం నుంచి వేడి ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లొద్దు. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది.