తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లోకి కియా 'ఈవీ6'.. 100 యూనిట్లు మాత్రమే.. బుకింగ్స్ ఎప్పుడంటే... - ఈవీ6

Upcoming electric cars in India: దేశీయ మార్కెట్​లో పెరుగుతున్న విద్యుత్తు వాహనాల డిమాండ్​ను అందుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్​ను తీసుకొస్తున్నాయి దిగ్గజ సంస్థలు. దక్షిణ కొరియా సంస్థ కియా.. హైఎండ్​ ప్రీమియం ఈవీ6ని ఈఏడాది చివరికల్లా తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు.. హోండా మోటర్​ సైకిల్​.. అనేక మోడళ్ల​ ఈ-బైక్స్​ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.

Kia EV6
కియా ఈవీ6

By

Published : Apr 21, 2022, 7:36 PM IST

Upcoming electric cars in India: విద్యుత్తు వాహనాలకు డిమాండ్​ పెరగటం వల్ల ఈ-వెహికిల్స్​పై దృష్టిసారిస్తున్నాయి ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థలు. భారత మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్​ను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే దక్షిణ కొరియా ఆటోమేకర్​ కియా.. భారత్​లో ఎలక్ట్రిక్​​ వాహనాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరికల్లా హైఎండ్​ ప్రీమియం ఎలక్ట్రిక్​ క్రాస్​ఓవర్​ ఈవీ6ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. భారత మార్కెట్లో ఇప్పటికే సెల్టోస్​, సొనెట్​ మోడల్స్​ను విక్రయిస్తున్న కియా.. ఎలక్ట్రిక్​ మోడల్​ ఈవీ6 బుకింగ్స్​ను మే 26న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. 100 యూనిట్లు మాత్రమే భారత్​లో విక్రయించనున్నట్లు తెలిపింది.

కియా ఈవీ6 మోడల్​

"భారత్​లో మా బ్రాండ్​ను మరోస్థాయికి చేర్చేందుకు కియా సిద్ధమైంది. అంతర్జాతీయంగా అత్యంత ఆదరణ లభిస్తున్న విద్యుత్తు వాహన శ్రేణిని ప్రారంభిస్తున్నాం. ఈవీ6 నిజమైన గేమ్​ ఛేంజర్​. అల్ట్రాఫాస్ట్​ ఛార్జింగ్​ సామర్థ్యం, విశాలమైన హైటెక్​ ఇంటీరియర్​ ద్వారా సౌకర్యవంతంగా ఉండేలా మా వాహనాన్ని తీర్చిదిద్దుతున్నాం. విద్యుత్తు వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులను మాత్రమే కాదు.. ప్రీమియం కారు కోసం వేచిచూస్తున్న కస్టమర్లను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. "

- తేజిన్​ పార్క్​, కియా ఇండియా ఎండీ.

హోండా నుంచి ఈ-బైక్స్: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటర్​ సైకిల్​, స్కూటర్​ ఇండియా(హెచ్​ఎంఎస్​ఐ) దేశీయ మార్కెట్లోకి అనేక మోడళ్లలో ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు.. ఎంట్రీ లెవల్​లో 100 సీసీ బైక్​ తీసుకురానుండగా.. ఎగుమతులను పెంచుకునేందుకు వివిధ మోడల్స్​ను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఇందుకు హరియాణాలోని మనేసర్​ ప్లాంట్​ను గ్లోబల్​ హబ్​గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపింది. ​వీటితో పాటుగా ప్రస్తుతం ఉన్న మోడల్స్​లో ఫ్లెక్స్​ ఫ్యూయల్​ సాంకేతికతను తీసుకురానున్నట్లు పేర్కొంది.

మారుతి ఎక్స్​ఎల్6 కొత్త వెర్షన్​: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ గురువారం మల్టీపర్పస్​ వెహికిల్​ ఎక్స్​ఎల్​6లో కొత్త వెర్షన్​ను విడుదల చేసింది. ఈ కొత్త ఎక్స్​ఎల్​6 వెర్షన్​లో 75.8కిలోవాట్ల పవర్​తో 1.5 లీటర్ల పెట్రోల్​ ఇంజిన్​ ఉంది. అలాగే.. అది మాన్యువల్​, ఆటోమేటిక్​ ట్రాన్స్​మిషన్​ మోడ్​లోనూ పని చేయనుంది. దీని ధర రూ.11.29 లక్షల నుంచి రూ.14.55 లక్షలు(ఎక్స్​షోరూం ధర) మధ్య ఉండనుందని సంస్థ తెలిపింది. ప్రస్తుత సవాళ్ల సమయంలో సంస్థ పగ్గాలు చేపట్టటం చాలా సంతోషంగా ఉందని, ఈ సవాళ్లను అధిగమించి ముందుకు సాగుతామని పేర్కొన్నారు ఇటీవలే మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓగా నియామకమైన హిసా టేకుచి.

మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6

4 లక్షల మార్క్​ దాటిన టాటా టియాగో: దేశీయ దిగ్గజ ఆటోమేకర్​ టాటా మోటర్స్​ నుంచి విడుదలైన టాటా టియాగో మరో మైలురాయిని చేరుకుంది. 4 లక్షల విక్రయాల మార్క్​ను చేరుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఎంట్రీ లెవల్​ మోడల్​ను 2016లో మార్కెట్లోకి తీసుకొచ్చింది టాటా మోటర్స్​. అతి తక్కువ సమయంలో ఈ చారిత్రక మైలురాయిని చేరుకున్న తొలికారుగా టియాగో నిలిచినట్లు టాటా మోటార్స్​ ప్రయాణికుల వాహనాల ఉపాధ్యక్షుడు రజన్​ అంబా తెలిపారు. అత్యంత సురక్షితమైన, ఆకర్షణీయమైన కారు కోసం చూసే యువత ఎక్కువగా టియాగోకే ప్రాధాన్యం ఇచ్చారని, 60 శాతానికిపైగా విక్రయాలు తొలిసారి కారు కొనుగోలు చేసినవారే ఉన్నట్లు పేర్కొన్నారు.

4 లక్షల మార్క్​ను చేరుకున్న టాటా టియాగో

బ్యాటరీ మార్పిడిపై నీతి ఆయోగ్​ ముసాయిదా: దేశంలో విద్యుత్తు వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీ మార్పిడి పాలసీ ముసాయిదాను విడుదల చేసింది నీతి ఆయోగ్​. మార్పిడి చేసే బ్యాటరీలకు ప్రోత్సాహకాలు ఇవ్వటం సహా కఠినమైన పరీక్షలను సూచించింది. విద్యుత్తు వాహనాల్లో మంటలు చెలరేగి వాటి భద్రతపై ఆందోళన నెలకొన్న తరుణంలో ఈ ముసాయిదాను తీసుకురావటం ప్రాధాన్యం సంతరించుకుంది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానులు, 5 లక్షలకు మించి జనాభా కలిగిన నగరాల్లో రెండో దశలో బ్యాటరీ స్వాపింగ్​ ప్రాజెక్టులు చేపట్టాలని పేర్కొంది. బ్యాటరీ కిలోవాట్​హవర్​ రేటింగ్​ ఆధారంగా ప్రోత్సాహకాలు నిర్ణయించాలని తెలిపింది. సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా విభాగం ద్వారా రాయితీలు ఇచ్చేందుకు సరైన వ్యవస్థ ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి:డాట్సన్‌కు నిస్సాన్‌ గుడ్‌బై.. భారత్‌లో ఉత్పత్తి నిలిపివేత

విద్యుత్తు వాహనాల్లో మంటలు.. ఆ స్కూటర్ల రీకాల్​!

ABOUT THE AUTHOR

...view details