Stock Market Today: భారత్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (సెన్సెక్స్) 867 పాయింట్లు కోల్పోయి 54,836కు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (నిఫ్టీ) 271 పాయింట్ల నష్టంతో 16,411 వద్ద స్థిరపడింది. రియల్ ఎస్టేట్, మెటల్, ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు విద్యుత్ రంగం సూచీలు లాభాలను నమోదు చేశాయి. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈరోజు రూ.4.31 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
ఇంట్రాడే సాగిందిలా.. నష్టాల మధ్యే.. 54,928 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మరింత దిగజారి ఓ దశలో 54,586కు చేరింది. శుక్రవారం సెషన్లో గరిష్ఠంగా 55,070 పాయింట్లు నమోదు చేసింది. మరోవైపు 16,415 వద్ద ప్రారంభమైన నిఫ్టీ కూడా నష్టాలను ఎదుర్కొంది. కనిష్ఠంగా 16,340.. గరిష్ఠంగా 16,484 పాయింట్లు నమోదు చేసింది.