స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్లో భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,158 పాయింట్లు పతనమై 52,930 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 359 పాయింట్లు క్షీణించి 15,808 వద్ద ముగిసింది. ఆటో, బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ సహా అన్ని ప్రధాన రంగాల షేర్లు నష్టాలను నమోదు చేయడం మార్కెట్ పతానానికి కారణమైంది. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలలో భారీగా విక్రయాలు నమోదయ్యాయి.
53,608 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 53,632 గరిష్ఠాన్ని నమోదు చేయగా.. కనిష్ఠంగా 52,702 పాయింట్లకు పతమైమంది. 16,021 వద్ద ప్రారంభమైన నిఫ్టీ కూడా గరిష్ఠంగా 16,041ను తాకింది. ఓ దశలో 15,735 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రతికూలతలు నమోదయ్యాయి. ఆసియాలోని టోక్యో, హాంకాంగ్, సియోల్, షాంగై మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. ఐరోపా, అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం సెషన్లో విదేశీ పెట్టుబడి దారులు భారీ మొత్తంలో షేర్లను విక్రయించడం కూడా మార్కెట్ పతనానికి కారణమని తెలుస్తోంది.
- బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ మొదలైన దిగ్గజ సంస్థలు నష్టాలను నమోదు చేయగా.. విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు మాత్రమే లాభాలు అర్జించాయి.