Stock Market Update: స్టాక్ మార్కెట్లు మంగళవారం దూసుకెళ్లాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో భారీ లాభాలు నమోదు చేశాయి. ఆరంభంలోనే 363 పాయింట్లు ఎగబాకిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. చివర్లో మరింత పుంజుకొని 1344 పాయింట్ల లాభంతో 54,318 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో నమోదిత 30 కంపెనీల షేర్లన్నీ లాభాల్లోనే ట్రేడింగ్ ముగించాయి. లోహ రంగ సూచీ 6 శాతానికిపైగా లాభపడింది. ఆటో, ఆర్థిక రంగ షేర్లు సైతం గణనీయంగా లాభాలు గడించాయి. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు రాణించాయి.
మరోవైపు, నిఫ్టీ సైతం భారీగా వృద్ధి చెందింది. 417 పాయింట్లు లాభపడి.. 16,260 వద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీలోని 50 షేర్లలో 48 కంపెనీలు లాభాలు సాధించాయి.
LIC shares listing: అయితే, మంగళవారం మార్కెట్లలో లిస్ట్ అయిన ఎల్ఐసీ షేర్లు మదుపర్లను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఎన్ఎస్ఈలో ఎల్ఐసీ షేరు ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 8.11 శాతం రాయితీతో రూ.872 వద్ద లిస్టయ్యింది. బీఎస్ఈలో ఒక్కో షేరు 8.62 శాతం రాయితీతో రూ.867.20 వద్ద లిస్టయింది. ట్రేడింగ్ ప్రారంభంలో షేరు కాస్త కోలుకున్నట్టు కనిపించినా.. కొద్ది నిమిషాలకే ఊగిసలాటకు గురైంది. అనంతరం ఫ్లాట్‌గా ట్రేడింగ్ అయి.. చివరకు 7.75 శాతం నష్టంతో 875.45 వద్ద స్థిరపడింది.
LIC listing losses: స్టాక్ మార్కెట్‌లో నెలకొన్న ఊహించని పరిస్థితుల కారణంగానే షేర్లు తక్కువ ధర వద్ద లిస్టయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మంచి లాభాల కోసం షేర్లను దీర్ఘకాలం అట్టిపెట్టుకోవాలని సూచించింది. "మార్కెట్ పరిస్థితుల్ని ఎవరూ అంచనా వేయలేరు. ఒకరోజు కోసం కాకుండా దీర్ఘకాలం కోసం షేర్లను ఉంచుకోవాలని మేం ముందు నుంచీ చెబుతూ వస్తున్నాం. అయితే, రాయితీ ధర వద్ద షేర్లను దక్కించుకున్న పాలసీదారులు, ఉద్యోగులు, రిటైల్ మదుపర్లకు మాత్రం కొంత రక్షణ లభించింది" అని 'పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం' కార్యదర్శి తుహిన్‌కాంత పాండే వివరించారు.