Stock Market Close: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడయ్యాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరకు లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 231 పాయింట్లు పెరిగి 57 వేల 593 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 17 వేల 222 వద్ద సెషన్‌ను ముగించింది. ఆటో, బ్యాంకింగ్, లోహం, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు రాణించాయి. ఐటీ, ఫార్మా రంగం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమవ్వడం, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్బీఐ ప్రకటన, రష్యా- ఉక్రెయిన్ మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశం నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా ట్రేడయినట్లు నిపుణులు చెబుతున్నారు.
- సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో సెషన్‌ను ప్రారంభించి.. కాసేపటికే నష్టాల్లోకి మళ్లింది.
- ఓ దశలో 500 పాయింట్లకుపైగా కోల్పోయి 56 వేల 825 వద్ద సెషన్ కనిష్ఠాన్ని నమోదుచేసింది.
- మధ్యాహ్నం ఐరోపా మార్కెట్లు సానుకూలంగా కదలాడటం వల్ల లాభాల్లోకి వచ్చాయి. 270 పాయింట్లకుపైగా పెరిగి మళ్లీ 57 వేల 638 వద్ద గరిష్ఠాన్ని తాకింది.
- లాభనష్టాల్లో:భారతీ ఎయిర్‌లెట్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐచర్ మోటార్స్, ఎస్బీఐ, ఐటీసీ లాభాలు నమోదుచేశాయి. యూపీఎల్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ డీలాపడ్డాయి.