తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2023, 1:51 PM IST

Updated : Apr 5, 2023, 2:29 PM IST

ETV Bharat / business

500కోట్ల డాలర్లు అప్పు తీసుకున్న రిలయన్స్, జియో.. దేశ చరిత్రలో అత్యధికం!

రిలయన్స్, దాని అనుబంధ సంస్థ జియో కలిసి 5 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను సేకరించాయి. ఇది భారత దేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద సిండికేట్ రుణమని వ్యాపార వర్గాలు తెలిపాయి.

reliance jio loan
reliance jio loan

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్​), దాని అనుబంధ సంస్థ జియో కలిసి 5 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను సేకరించాయి. ఇది భారతదేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద సిండికేట్ రుణమని వ్యాపార వర్గాలు తెలిపాయి. రిలయన్స్ గత వారం 55 బ్యాంకుల నుంచి 3 బిలియన్ డాలర్లు సేకరించిందని పేర్కొన్నాయి. టెలికాం దిగ్గజం జియో 18 బ్యాంకుల నుంచి మరో 2 బిలియన్ డాలర్ల అదనపు రుణాన్ని పొందిందని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.

టెలికాం దిగ్గజం జియో తీసుకున్న రుణాన్ని దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్​ను అభివద్ధి చేసేందుకు ఉపయోగించనుంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ సేకరించిన 3 బిలియన్ డాలర్ల నిధులను మూలధన వ్యయం కోసం ఖర్చు చేయనున్నారు. రిలయన్స్​కు 3 బిలియన్ డాలర్లు రుణం ఇచ్చిన వారిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్​ఎస్​బీసీ, ఎమ్​యూఎఫ్​జీ, సిటీ, ఎస్​బీసీ, సిటీ, ఎస్​ఎంబీసీ, మిజుహో, క్రెడిట్ అగ్రికోల్ వంటి ప్రపంచ దిగ్గజాలతో సహా దాదాపు 55 మంది రుణదాతలు ఉన్నారు. ఇందులో రిలయన్స్​కు రుణాలు ఇచ్చిన వాటిలో దాదాపు 20 తైవానీస్​ బ్యాంకులు ఉన్నాయి.

ఆయిల్ నుంచి టెలికాం వరకు విజయవంతమైన వ్యాపారాలను నిర్వహిస్తూ ముకేశ్​ అంబానీ ముందుకు సాగుతున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో నిధుల సమీకరణ కోసం రిలయన్స్ గ్రూప్ సిండికేటెడ్ లోన్ మార్కెట్‌లో క్రియాశీలకంగా లేదు. ఈ క్రమంలో బ్లూ చిప్ కంపెనీకి రుణాలను అందించేందుకు మార్కెట్ నుంచి మంచి స్పందన లభించగా.. రెండు బిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని అంబానీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దేశంలో 5జీ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియో అందుకు భారీగా నిధులను ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో గత సంవత్సరం మూలధన వ్యయం అవసరాల కోసం దాదాపు 750 మిలియన్ డాలర్ల ఐదేళ్ల న్యూ-మనీ క్లబ్ రుణాన్ని పొందింది. తాజాగా కంపెనీ సమీకరించిన నిధులను జియో నెట్ వర్క్ విస్తరణకు, రిటైల్ వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు వినియోగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ముకేశ్​ అంబానీ..
2023 ఏడాదికి ప్రతిష్టాత్మక ఫొర్బ్స్ 37వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 83.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గతేడాది 90.7 బిలియన్​ డాలర్ల సంపదతో 10వ స్థానంలో ఉన్న అంబానీ.. ఈ ఏడాది ఓ మెట్టు పైకి ఎక్కారు.

Last Updated : Apr 5, 2023, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details