MRF stock price : ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ షేర్ ధర లక్ష రూపాయలు దాటింది. భారతదేశంలో రూ.1 లక్ష మార్క్ దాటిన తొలి స్టాక్‌గా ఇది చరిత్ర సృష్టించింది. మంగళవారం కంపెనీ షేర్ విలువ లక్ష రూపాయల మార్క్‌ను దాటి జీవనకాల గరిష్ఠాన్ని తాకింది.
చేరువగా వచ్చి.. వెనక్కి
గత నెలలోనే ఎంఆర్ఎఫ్ షేర్ దాదాపుగా రూ.1 లక్ష మార్క్‌కు చేరువగా వచ్చి, తరువాత వెనక్కిమళ్లింది. ప్యూచర్స్ మార్కెట్లో మాత్రం మే 8న ఈ కీలక మైలు రాయిన దాటి మదుపరుల్లో మరింత ఆత్రుతను పెంచింది. మంగళవారం ఎన్ఎస్ఈలో 1.48 శాతం లాభంతో రూ.1,00,439.95 దగ్గర ఎంఆర్ఎఫ్ ప్రారంభమైంది. బీఎస్ఈలో రూ.1,00,300 వద్ద ట్రేడింగ్ స్టార్ట్ చేసింది.
46 శాతం పెరిగిన షేర్ వాల్యూ
ఏడాది వ్యవధిలోనే ఎంఆర్ఎఫ్ షేర్ వాల్యూ 46 శాతం పెరగడం విశేషం. మే 8న ఈ స్టాక్ స్పాట్ మార్కెట్లో రూ.99,933 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మెరుగైన త్రైమాసిక, వార్షిక ఫలితాలు కలిసివచ్చి స్టాక్ ర్యాలీకి ఊపునిచ్చాయి.
రెండున్నర ఏళ్ల పట్టింది!
2021 జనవరిలో ఎంఆర్ఎఫ్ షేర్ తొలిసారి రూ.90వేలు మార్క్‌ను క్రాస్ చేసింది. అక్కడి నుంచి రూ.1 లక్ష మైలు రాయిని చేరేందుకు ఈ స్టాక్‌కు దాదాపుగా రెండున్నర ఏళ్లు పట్టింది.
షేర్లు విభజించడం లేదు!
వాస్తవానికి స్టాక్ విలువ అమాంతం పెరుగుతున్నప్పటికీ.. కంపెనీ మాత్రం షేర్లను విభజించకపోవడం విశేషం. అలాగే ఇప్పటి వరకు ఎలాంటి బోనస్ షేర్లను జారీ చేయకపోవడం గమనార్హం. సాధారణంగా షేర్ల విలువ భారీగా పెరిగినప్పుడు కంపెనీలు వాటిని విభజిస్తూ ఉంటాయి. ఫలితంగా సామాన్య రిటైల్ మదుపర్లు కూడా వాటిని కొనేందుకు వీలవుతుంది. కానీ ఎంఆర్ఎఫ్ ఆ దిశగా ఎన్నడూ అడుగులు వేయలేదు.