India startup unicorns 2022: దేశంలోని అంకుర సంస్థల్లో వందకు పైగా త్వరలోనే యూనికార్న్ స్థాయికి చేరనున్నట్లు 'హ్యూరన్ పరిశోధన సంస్థ' సమీక్షలో వెల్లడైంది. ఆస్క్ వెల్త్, హ్యూరన్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్- 2022ను బుధవారం బెంగళూరులో విడుదల చేశారు.
అమెరికా, చైనాల తర్వాత అత్యధిక యూనికార్న్‌లు ఉన్న దేశంగా భారత్ ఆవిర్భవించనున్నట్లు ఆస్క్ వెల్త్ అడ్వైజర్స్ సీఈఓ రాజేశ్ సలూజా, హ్యూరన్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ ఈ సందర్భంగా చెప్పారు. 1 బిలియన్ డాలర్లు (రూ.7,892 కోట్ల) విలువకు చేరుకున్న సంస్థను యూనికార్న్‌గా పరిగణిస్తారు. దేశంలో 2000 తర్వాత ప్రారంభించి 200 మిలియన్ డాలర్లు- 1 బిలియన్ డాలర్ల మధ్య వ్యాపార సామర్థ్యం కలిగి, పబ్లిక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో లేని స్టార్టప్‌లను సమీక్షించారు. వీటిని రెండేళ్లలో యూనికార్న్ స్థాయికి చేరే గజెల్స్ (జింక), నాలుగేళ్లలో చేరే చీతా (చిరుత)లుగా వర్గీకరించారు. ఈ అంకురాల వ్యాపార, ఉత్పాదన ప్రగతి స్థిరంగా కొనసాగితే రానున్న మూడు నాలుగేళ్లలో 122 అంకురాలు యూనికార్న్ స్థాయికి చేరతాయని నివేదిక స్పష్టం చేసింది. వీటి ప్రస్తుత విలువ 49 బిలియన్ డాలర్లని, గతేడాదితో పోలిస్తే ఇది 36 శాతం పెరిగిందని పేర్కొంది.