తెలంగాణ

telangana

ETV Bharat / business

వ్యాక్సిన్ వార్తలు, ఆటో సేల్స్​ లెక్కలే కీలకం! - షేర్ మార్కెట్లపై కరోనా ప్రభావం

కరోనా కేసులు, వ్యాక్సినేషన్ అప్​డేట్స్​ సహా వాహన విక్రయ గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. వీటికి తోడు స్థూల ఆర్థిక గణాంకాలు, రాష్ట్రాల వారీగా అన్​లాక్​పై తీసుకునే నిర్ణయాలు మార్కెట్లకు కీలకమైన అంశాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Stock market this week Expectations
ఈ వారం స్టాక్ మార్కెట్లపై అంచనాలు

By

Published : Jun 27, 2021, 1:17 PM IST

స్టాక్ మార్కెట్లను ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, కొవిడ్ వ్యాక్సినేషన్​ అప్​డేట్స్​, అంతర్జాతీయ పరిణామాలు ముందుకు నడిపించనున్నాయంటున్నారు విశ్లేషకులు. రుతుపవనాల వార్తలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని చెబుతున్నారు. ఈ వారంలోనే జూన్​ నెలకు సంబంధించి వాహన విక్రయాల గణాంకాలు, తయారీ రంగ పీఎంఐ డేటా విడుదల కానున్నాయి. ఈ గణాంకాల ప్రభావం మార్కెట్లపై కీలకంగా ఉండనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

'వ్యాక్సినేషన్ సానుకూలతలు సహా మరిన్ని రాష్ట్రాల్లో సడలింపులు ఇచ్చేందుకు దోహదం చేయొచ్చు. అయితే పెరుగుతున్న కొత్త వేరియంట్​ కేసులు ఇందుకు సవాలుగా మారొచ్చు.' అని రెలిగేర్​ బ్రోకింగ్ పరిశోధనా విభాగం ఉపాధ్యక్షుడు అజిత్​ మిశ్రా పేర్కొన్నారు.

ఈ వారం మధ్యలో విడుదల కానున్న వాహన విక్రయాల గణాంకాలపై మదుపరుల సెంటిమెంట్ ఆధారపడి ఉంటుందని మార్కెట్​ బ్రోకర్లు చెబుతున్నారు. వాహన సహా పలు ఇతర రంగాలకు ఇది కీలకమైన అంశమని చెబుతున్నారు. మదుపరులు రోజువారీ కరోనా కేసులు, వ్యాక్సినేషన్, రుతుపవనాల అప్​డేట్స్​పై దృష్టి సారించే వీలుందని అంటున్నారు.

వీటన్నింటితో పాటు ముడి చమురు ధరలు, రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

లిస్టింగ్​కు కొత్త కంపెనీలు..

హైదరాబాద్​ కేంద్రంగా పని చేస్తున్న క్రిష్ణ ఇన్స్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్ సైన్సెస్​ లిమిటెడ్​ (కిమ్స్​), దొడ్ల డెయిరీ సంస్థలు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈల్లో సోమవారమే లిస్టింగ్​కు రానున్నాయి. ఈ నెల 16-18 మధ్యే ఇరు సంస్థలు ఐపీఓకు వచ్చాయి.

ఇదీ చదవండి:అదనపు డీఏ చెల్లింపులపై ప్రభుత్వం క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details