తెలంగాణ

telangana

By

Published : Jan 25, 2021, 5:25 PM IST

ETV Bharat / business

పద్దు 2021: పన్ను రూపంలో కరోనా కాటు..!

కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల వల్ల ఈ సారి బడ్జెట్​ ప్రత్యేకంగా ఉండనుంది. ఇప్పటికే బడ్జెట్​ ప్రతులు ముద్రించడం లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇంకా ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేమిటి? మార్పులు వెనకున్న అవసరాలేమిటి అనేది ఇప్పడు తెలుసుకుందాం.

Corona impact on Budget
బడ్జెట్​పై కరోనా ప్రభావం

ఈసారి బడ్జెట్‌ను కరోనా వైరస్‌ కమ్మేసిందనే చెప్పాలి. బడ్జెట్‌ కాపీల ముద్రణ‌ నుంచి పన్ను ప్రతిపాదనల వరకూ ప్రతి అంశాన్ని ఇది ప్రభావితం చేసింది. ఇప్పటికే వ్యాపారాలు మందకోడిగా ఉండటం వల్ల కొత్త పన్నులు జోడించడం గానీ, పెంచడం గానీ చేయవద్దని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కొత్తగా 'కరోనా సెస్సు' విధించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి..

ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వీటిల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కోసం భారీగా నిధులను కేటాయించాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆదాయాలను వీలైనంత పెంచుకొనే మార్గాలను వెతుకుతోంది. ఈ అంశంపై ఇప్పటికే ఓ విడత చర్చించినట్లు తెలిసింది. ఈ అంశంపై తుది నిర్ణయం ఫిబ్రవరి1న ప్రకటించనున్నారు. మరోపక్క ఈ అంశాన్ని ఆర్థిక నిపుణులు కూడా వ్యతిరేకిస్తున్నారు. కొత్త పన్నులు విధించడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. టీకా పంపిణీ నిమిత్తం ఈ ఏడాది ప్రభుత్వానికి సుమారు రూ.65,000 కోట్ల వరకు వెచ్చించాల్సి రావచ్చు. ఇందుకోసం వైద్య సిబ్బంది శిక్షణ, రవాణా సౌకర్యాలు, పంపిణీ, నిల్వ వ్యయాలు మొత్తం కేంద్రం భరించే అవకాశం ఉంది. దీనికి అదనంగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై, గ్రామీణ ప్రాంతాలపై అదనంగా నిధులను వెచ్చించాల్సి రావచ్చు. దీంతో కేంద్రం ఓ కొత్త సెస్సు విధించి నిధులు సమీకరించాలని భావిస్తోంది.

సెస్సు ఎలా ఉండే అవకాశం ఉంది..?

కరోనా సెస్సు ఎలా విధించాలనే అంశంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. దీనికి సంబంధించి మూడు ప్రతిపాదనలు ఉన్నాయి. అత్యధిక ఆదాయ వర్గంపై స్వల్ప స్థాయిలో సెస్సు విధించాలని లేదా ఇంధనంపై విధించే సెస్సుల్లో దీనిని జోడించాలని భావించారు. దీంతోపాటు అత్యంత విలువైన వస్తువులపై కూడా దీనిని విధించాలనే సూచనలు వచ్చాయి. కాకపోతే కేంద్రం ఏకపక్షంగా ఈ సెస్సును విధించే అవకాశం లేదు. జీఎస్‌టీ కౌన్సిల్‌ కూడా దీనికి ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. పన్నులతో పోలిస్తే సెస్సులు వేగంగా నిధులను సమకూర్చనుండటం వల్ల ప్రభుత్వం దీనికి మొగ్గు చూపుతోంది. ఎందుకంటే కేంద్ర సెస్సుల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు.

రాష్ట్రాలు ఇప్పటికే సెస్సుల బాట..

మరోపక్క చాలా రాష్ట్రాలు ఇప్పటికే వేర్వేరు రూపాల్లో తాము విధించే పన్నులపై సెస్సులను విధిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా జీఎస్‌టీలో వాటా తగ్గడంతో ఈ నిర్ణయానికి వచ్చాయి. ఝార్ఖండ్‌ ఇప్పటికే ఖనిజాలపై కొవిడ్‌ సెస్‌ విధించింది. పంజాబ్‌లో మద్యంపై 70శాతం కరోనా సెస్‌ విధించారు. జూన్‌లో దీనిని నిలిపివేసినా.. వ్యాట్‌ను మాత్రం పెంచారు.

ఇదీ చూడండి:నోట్ల ఉపసంహరణపై క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

ABOUT THE AUTHOR

...view details