తెలంగాణ

telangana

ETV Bharat / business

పెద్ద పాలసీలకు పెరిగిన గిరాకీ

మారిన పరిస్థితులతో ఆరోగ్య బీమాకు డిమాండ్ భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే వైద్య ఖర్చుల్లో వృద్ధి ఇందుకు కారణం. కొత్తగా బీమా తీసుకునే వాళ్లు పెద్ద మొత్తంలో కవర్​ చేసే పాలసీలవైపు చూస్తున్నట్లు బీమా సంస్థలు చెబుతున్నాయి. అంతకు ముందే పాలసీ తీసుకున్న వారు కూడా పాలసీ మొత్తాన్ని పెంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారని పేర్కొంటున్నాయి. మరి పెద్ద పాలసీతో ఉపయోగమెంత? పాలసీ మొత్తాన్ని పెంచుకునేందుకు ఉన్న అవకాశాలేమిటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!

Reasons for the increase in health insurance demand
కరోనాతో పెరిగిన ఆరోగ్య బీమాలు

By

Published : Jan 10, 2021, 2:56 PM IST

Updated : Jan 10, 2021, 3:05 PM IST

ఆరోగ్య బీమా.. ఒకప్పుడు దీని గురించి పట్టించుకున్న వారు తక్కువేనని చెప్పాలి. తీసుకున్నా రూ.లక్ష, రూ.2 లక్షల పాలసీలు తీసుకుంటే చాలన్న ధోరణి ఉండేది. కానీ, కరోనా మహమ్మారితో ఈ ఆలోచన ఒక్కసారిగా మారిపోయింది. తక్కువ పాలసీ ఉన్నా.. లేనట్లే అనే భావన పాలసీదార్లకు వచ్చింది. దీంతో అధిక విలువైన పాలసీలపైనే ఇప్పుడు ఎక్కువమంది దృష్టి సారిస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం వైద్య చికిత్స ఖర్చులు అంతగా ఉండేవి కావు. కానీ, ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు మారిపోయాయి. అప్పటితో పోలిస్తే.. చికిత్స ఖర్చులు కొన్ని రెట్లు పెరిగాయి. నాలుగైదేళ్ల క్రితం రూ.2లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నా అది పెద్ద మొత్తంగానే తోచేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక్క రోజుకు సరిపోవడం కష్టమే.

పెంచుకోవడం ఎలా?

ఇప్పటికే పాలసీ తీసుకున్న వాళ్లు.. తమ పాలసీ మొత్తాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోగ్య బీమా సలహాదారులు చెబుతున్నారు. పునరుద్ధరణ కోసం వస్తున్నవారిలో సగానికన్నా ఎక్కువమంది తమ పాలసీ మొత్తాన్ని పెంచుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఇంకా సమయం ఉన్నవారు.. పాలసీ మొత్తాన్ని పెంచుకునేందుకు 'టాపప్‌'లను ఆశ్రయిస్తున్నారు. ప్రాథమిక బీమా పాలసీ రూ.3 లక్షల వరకూ ఉన్నవాళ్లు ఎక్కువగా టాపప్‌ పాలసీల కోసం చూస్తున్నారు. తక్కువ ప్రీమియంతో లభించడం వల్ల కూడా వీటికి ఇటీవల కాలంలో వీటికి ఆదరణ బాగా పెరుగుతోంది.

కొత్త పాలసీల్లో..

ఆరోగ్య బీమా పాలసీలను తొలిసారి తీసుకునే వాళ్లు ఎక్కువగా రూ.10 లక్షలు లేదా అంతకు మించి పాలసీల కోసమే ఎక్కువగా చూస్తున్నారు. బీమా అగ్రిగేటర్‌ పాలసీబజార్‌.కామ్‌ నివేదిక ప్రకారం గత రెండు మూడు నెలలుగా పాలసీలు తీసుకునేవారు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఆరోగ్య బీమా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొవిడ్‌-19 తర్వాత ఆరోగ్య బీమాపై అవగాహన పెరగడమూ ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది.

అందుబాటు ధరల్లోకి రావడమే..

ప్రస్తుతం ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం పెరిగింది. అదే సమయంలో అధిక విలువైన పాలసీల ప్రీమియం కాస్త అందుబాటులోకి వచ్చింది. గతంతో పోలిస్తే ఈ పాలసీల ప్రీమియాలు దాదాపు 30-40 శాతం వరకూ తగ్గాయి. అందుకే, చాలామంది అధిక విలువ పాలసీలను తీసుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు. అదే సమయంలో ప్రీమియం చెల్లింపులో బీమా సంస్థలు కొన్ని వెసులుబాట్లనూ కల్పిస్తున్నాయి. అక్టోబరు నుంచి బీమా సంస్థలు నెలవారీ ఈఎంఐ పద్ధతిలో ప్రీమియం వసూలు చేసే పాలసీలను తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. ఏడాది పాటు ఈ వెసులుబాటు కల్పించాలని చెప్పింది. అయితే, ఈ పద్ధతి కాస్త మెరుగ్గా ఉండటం, పాలసీదారులపైనా భారం అంతగా ఉండకపోవడం వల్ల బీమా సంస్థలు తమ కొత్త పాలసీల్లో ఈఎంఐని పరిచయం చేయడం మొదలు పెట్టాయి. అంటే, ఒకేసారి రూ.15,000 ప్రీమియం చెల్లించే బదులు ఏడాదిపాటు నెలకు రూ.1,250 చెల్లిస్తే చాలన్నమాట. దీంతోపాటు దీర్ఘకాలిక పాలసీలు అంటే రెండు, మూడేళ్ల వ్యవధితో పాలసీలు తీసుకునేవారూ పెరిగారు. ప్రీమియంలో 7.5%-15% వరకూ రాయితీ రావడమే ఇందుకు కారణం.

యువత ముందుకు వస్తోంది..

గతంలో ఆరోగ్య బీమా పాలసీలంటే.. 40 ఏళ్లు దాటిన వారికే అనే ధోరణి ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు 30 ఏళ్లలోపు వారే ఎక్కువగా పాలసీ తీసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. పాలసీబజార్‌ సర్వే ప్రకారం 52 శాతం కొత్త పాలసీలు 30-40 ఏళ్లలోపు వారే కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 13 శాతం మందికి ఇప్పటికే కొన్ని ముందస్తు వ్యాధులున్నట్లూ తెలిపింది. యాజమాన్యం అందించే బృంద బీమాలో ఎక్కువమంది సభ్యులుగా ఉంటారు. వీళ్లంతా గతంలో సొంతంగా బీమా తీసుకునేందుకు అంతగా ఇష్టపడేవారు కాదు. కానీ, ఉద్యోగ భద్రత తగ్గడం వల్ల వీళ్లంతా పాలసీలను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక బీమా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. వ్యక్తిగత పాలసీల్లో ఎక్కువగా 25-30 ఏళ్లలోపు వాళ్లూ ఉంటున్నారు. మిగతావాళ్లు కుటుంబానికి అంతటికీ వర్తించే ఫ్యామిలీ ఫ్లోటర్‌ను ఎంచుకుంటున్నారు. సీనియర్‌ సిటిజెన్‌ పాలసీలకు సాధారణంగా ప్రీమియం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ.. తమ తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునేందుకు చాలామంది సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐల నుంచి వీటికి సంబంధించిన విచారణలు ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం.

అన్నీ చూశాకే..

తక్కువ ప్రీమియంతో వస్తుందా అనేది ఆలోచించకుండా.. తాము తీసుకున్న పాలసీ ఆసుపత్రిలో చేరినప్పుడు ఎంత మేరకు ఆర్థిక రక్షణ కల్పిస్తుందనే అంశాన్నే పాలసీదారులు ఎక్కువగా గమనిస్తున్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులు, ఆయుష్‌ చికిత్స, రోబోటిక్‌ సర్జరీలు, ఉప పరిమితులు లేకపోవడం లాంటివాటితోపాటు, ఓపీడీ సేవలు, ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలకు అవకాశంలాంటివీ ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నారు. బీమా సంస్థలూ ఇందుకు అనుగుణంగా కొత్త పాలసీలు తీసుకురావడం, లేదా ఉన్న పాలసీలకు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. పలు బీమా సంస్థలు ఈ దిశగా ఇప్పటికే తమ పాలసీల్లో కొత్త వెసులుబాట్లను తీసుకొచ్చాయి.

ఇదీ చూడండి:లాభాలు కావాలంటే రిస్క్ చేయాలి గురూ!

Last Updated : Jan 10, 2021, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details