ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో వరుసగా రెండో సమీక్షలోనూ కీలక వడ్డీరేట్లలో భారతీయ రిజర్వు బ్యాంక్ ఎలాంటి మార్పు చేయకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉల్లి, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడం కారణంగా డిసెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్ఠానికి చేరి 7.35 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 8 శాతాన్ని దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలు ఆర్బీఐ వడ్డీరేట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
ద్రవ్యోల్బణం గణాంకాలే కీలకం..
సాధారణంగా ద్రవ్యోల్బణ గణాంకాలను ఆధారంగా తీసుకుని వడ్డీరేట్లలో మార్పులు చేస్తుంటారు. అయితే ఈసారి రిటైల్ ద్రవ్యోల్బణ స్థాయి గణనీయంగా ఉండటం కారణంగా ఫిబ్రవరిలో జరిగే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచే అవకాశాలున్నాయని ఎస్‌బీఐ అధ్యయన నివేదిక పేర్కొంది. గత డిసెంబరులో జరిగిన సమీక్షలోనూ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన విషయం విదితమే. 2020 సంవత్సరం మొత్తంలోనూ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు కన్పించట్లేదని ఈ నివేదిక పేర్కొంది.