దేశవ్యాప్తంగా మే 17వరకు లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో బ్యాంకు రుణాలపై మరో 3 నెలలు మారటోరియం విధించే ప్రతిపాదనను.. ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. కరోనా సంక్షోభం కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలు, పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు.. ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న మారటోరియం గడువు ఈ నెల 31తో ముగియనుంది.
లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఆదాయం కోల్పోయి..రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి లేనందున..మరో 3నెలల పాటు మారటోరియం విధించడమే ఉత్తమమని ప్రభుత్వ రంగ బ్యాంకులు అభిప్రాయం వ్యక్తం చేశాయి
శక్తికాంతదాస్ సమీక్ష
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థల నిర్వాహకులతో సోమవారం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశమయ్యారు. ద్రవ్యలభ్యత పరిస్థితులు తెలుసుకోవడం సహా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ)లకు రుణాలు ఏ విధంగా అందచేయాలనే విషయమై సమీక్షించారు. దృశ్య, మాధ్యమ పద్ధతుల్లో రెండు విడతలుగా నిర్వహించిన ఈ సమావేశాల్లో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారని బ్యాంక్ తెలిపింది.