మొండి బకాయిల నిబంధనల సడలింపు, రుణదాతల డివిడెండ్ చెల్లింపుల నిలుపుదల, బ్యాంకులు మరిన్ని రుణాలు ఇచ్చేలా రివర్స్ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది భారతీయ రిజర్వు బ్యాంకు. కరోనా ధాటికి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం నింపేందుకు మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించింది.
మార్చి 25న మొదలైన దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రెండోసారి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రవ్యలభ్యత పెంచుతామని, బ్యాంకులకు మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
నిబంధనలు సడలింపు...
మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) గుర్తింపు నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. ఎవరైనా తీసుకున్న రుణం 90 రోజుల్లో తిరిగి చెల్లించకపోతే వారి ఆస్తుల్ని నిరర్థక ఆస్తులుగా బ్యాంకులు పరిగణిస్తాయి. ప్రస్తుతం 90 రోజులుగా ఉన్న ఈ గడువును 180 రోజులకు పెంచింది ఆర్‌బీఐ.
ప్రయోజనం ఏంటి?
ఈ నిర్ణయం ద్వారా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) రుణగ్రహీతలు లబ్ధి పొందనున్నారు. ఈ కారణంగా ఎన్పీఏలలో పెరుగుదల ఉండదు కనుక చిన్న మధ్య తరహా పరిశ్రమలు, కార్పొరేట్లు... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి మరిన్ని రుణాలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది.
రివర్స్ రెపోరేటు తగ్గింపు...
నగదు సరఫరాను క్రమబద్ధీకరించేందుకు వీలుగా రివర్స్ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రస్తుతమున్న 4 శాతం నుంచి 3.75 శాతానికి (25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది.
ఏంటి లాభం?
తమ వద్ద ఎక్కువ మొత్తంలో నగదు ఉందనుకున్నప్పుడు వాణిజ్య బ్యాంకులు దాన్ని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇస్తుంటాయి. అలా తీసుకున్న మొత్తానికి ఆర్‌బీఐ చెల్లించే వడ్డీరేటును రివర్స్ రెపో రేటు అంటారు.
ప్రస్తుతం ఈ వడ్డీని తగ్గించడం వల్ల బ్యాంకులు డబ్బును ఆర్‌బీఐ వద్ద ఉంచేకంటే రుణాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయి. దీని ద్వారా రుణాలు ఆశించేవారికి త్వరగా అప్పు దొరికే అవకాశం ఉంటుంది. ఇలా ఆర్థిక లావాదేవీలు పెరిగేందుకు ఆస్కారముంది.