తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ 'ఆపరేషన్​ కరోనా'- వడ్డీ, ఈఎంఐపై కీలక నిర్ణయాలు - కరోనా తాజా వార్తలు

కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్న వేళ, రిజర్వు బ్యాంకు కీలక చర్యలు చేపట్టింది. రెపోరేటును75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. రివర్స్‌ రెపోరేటును ఏకంగా 90 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈఎంఐలపై 3 నెలల మారటోరియం విధించేందుకు అనుమతించింది.

RBI cuts repo rate
ఆర్​బీఐ ఆపరేషన్​ కరోనా

By

Published : Mar 27, 2020, 11:42 AM IST

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

  • రెపోరేటు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది.
  • రివర్స్‌ రెపోరేటును 90 పాయింట్లకు కుదించింది.
  • ఈ నిర్ణయాలతో ప్రస్తుతం రెపోరేటు 4.4 శాతం, రివర్స్‌ రెపోరేటు 4 శాతం వద్దకు చేరుకున్నాయి.

నిజానికి ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష మరికొద్ది రోజుల్లో జరగాల్సి ఉంది. కరోనా సంక్షోభం దృష్ట్యా ఈనెల 25, 26, 27 తేదీల్లో ముందుగానే నిర్వహించినట్లు తెలిపారు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌. ప్రస్తుత పరిస్థితులను రిజర్వ్​ బ్యాంక్​ నిశితంగా పరిశీలిస్తోందని వివరించారు. ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఆర్​బీఐ 'ఆపరేషన్​ కరోనా'- పలు కీలక నిర్ణయాలు

"విస్తృతస్థాయి చర్చల తర్వాత.. రెపోరేటు తగ్గించాలని ద్రవ్యపరపతి కమిటీ నిర్ణయించింది. వృద్ధిరేటు పుంజుకునే వరకు ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. రెపోరేటు తగ్గించే అంశంపై.. ద్రవ్యపరపతి కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరకు రెపోరేటును 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించి, 4.4 శాతానికి చేర్చేందుకు ద్రవ్యపరపతి కమిటీ 4:2 తేడాతో ఓటు వేసింది. ఇదే విధంగా రివర్స్‌ రెపో రేటు 90 బేసిస్‌ పాయింట్లు తగ్గించి.. 4 శాతానికి తీసుకొచ్చాం.

రివర్స్‌ రెపోరేటు తగ్గింపు....బ్యాంకులకు ఆకర్షణీయమైన నిర్ణయం అవుతుంది. బ్యాంకులు తమ సొమ్మును ఆర్‌బీఐ వద్ద ఉంచే కంటే... వాటిని తయారీ రంగానికి పెట్టుబడిగా అందించే అవకాశం ఉంటుంది.

కరోనా వైరస్‌ కారణంగా ఈ నిర్ణయం బలవతంగా తీసుకోవాల్సి వచ్చింది. వైరస్‌ వల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాలను తగ్గించడం, వృద్ధిరేటును తిరిగి పురోగమింపజేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడమే ఈ నిర్ణయాల ముఖ్యఉద్దేశం."

- శక్తికాంత దాస్​, ఆర్​బీఐ గవర్నర్​

కీలక నిర్ణయాలు...

  1. ఈఎంఐలపై 3 నెలల మారటోరియం
  2. బ్యాంకుల సీఆర్‌ఆర్‌ 100 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు.

ఈఎంఐలు కట్టక్కర్లేదా!

సామాన్యులకు కాస్త ఊరటనిచ్చేలా కీలక చర్యలు చేపట్టింది రిజర్వు బ్యాంకు. టెర్మ్​ లోన్స్​ నెలవారీ వాయిదాల చెల్లింపుపై 3 నెలల మారటోరియం విధించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చింది.

వర్కింగ్ కేపిటల్​పై వడ్డీ చెల్లింపు ఆలస్యమైనా రుణ ఎగవేతగా పరిగణించరాదని సూచించింది. చెల్లింపుల్లో జాప్యం.. రుణగ్రహీత క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది.

బ్యాంకులు భద్రం...

భారత్​లో బ్యాంకింగ్ వ్యవస్థ భద్రంగా ఉందని భరోసా ఇచ్చారు శక్తికాంత దాస్. ప్రైవేటు బ్యాంకుల్లోనూ ప్రజల డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. అనవసరంగా ఆందోళన చెంది, ప్రజలు ఒక్కసారిగా నగదు విత్​డ్రా చేయొద్దని కోరారు.

తీవ్ర ప్రభావం...

కరోనా సంక్షోభం... ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. 2019లో దశాబ్దపు కనిష్ఠానికి ప్రపంచ వృద్ధి రేటు పతనం కావడాన్ని గుర్తు చేశారు. 2020లో వృద్ధి కొంతైనా పుంజుకుంటుందన్న ఆశలు ఇప్పుడు ఆవిరైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details